Share News

హైడ్రా కంచె తొలగింపు!

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:04 AM

ఈదులకుంట పక్కన ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ.. ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్‌ వేసిన స్థలాన్ని స్థల యజమానులుగా చెబుతున్న వారు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

హైడ్రా కంచె తొలగింపు!

  • ఈదులకుంట పక్కనున్న స్థలంలో బోర్డుల తొలగింపు

  • కోర్టు తీర్పు ప్రకారమే : నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ ప్రవీణ్‌

  • హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్న హైడ్రా

  • సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం యోచన

హైదరాబాద్‌ సిటీ/హైటెక్‌సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ఈదులకుంట పక్కన ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ.. ఆక్రమణలు తొలగించి హైడ్రా ఫెన్సింగ్‌ వేసిన స్థలాన్ని స్థల యజమానులుగా చెబుతున్న వారు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ భూమిలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్‌ను తొలగించారు. ఈదులకుంట, పక్కనున్న స్థలం ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ మే 25న హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీనిపై స్థల యజమానులుగా చెబుతున్న వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ స్థలాన్ని యథావిధిగా ప్లాట్ల ఓనర్లకు 24 గంటలలోపు అప్పగించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. 48 గంటలైనా హైడ్రా అధికారులు స్పందించకపోవడంతో స్థల యజమానులు ఫెన్సింగ్‌, బోర్డులు తొలగించారు. ఈ సందర్భంగా కనకదుర్గా హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి బాబ్జితో కలిసి ఎన్వీఎన్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కె. ప్రవీణ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. హైడ్రా అధికారులు కోర్టు తీర్పును అమలుపర్చడం లేదన్నారు. రూ.9.30 కోట్లతో ఈ స్థలానికి యూఎల్‌సీ రెగ్యులరైజేషన్‌ చేయించామన్నారు. హైడ్రా చెబుతున్నట్టు ఈదులకుంట స్థలానికి, ఈ భూమికిసంబంధం లేదన్నారు. తమ స్థలం (సర్వే నంబర్లు 1003, 1004, 1005, 1006) కూకట్‌పల్లి మండలం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. ఇక్కడ భవన నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని, నాలుగు సెల్లార్ల వరకు తవ్వకాలు కూడా జరిగాయన్నారు. కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్పీల్‌కు వెళ్లాలని హైడ్రా భావిస్తోంది. పూర్తి వివరాలతో త్వరలో పిటిషన్‌ వేయనున్నట్టు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. సర్కారీ భూమిని యూఎల్‌సీ ల్యాండ్‌గా చూపుతూ క్రమబద్ధీకరించుకున్నారని ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. గతంలో ఈ భూమికి సంబంధించి ఉమ్మడి ఏపీలోని మాజీమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆమెను ఎవరు కిడ్నాప్‌ చేశారు..? ఎవరు చేయించారు? ఆయా వ్యక్తుల నేర చరిత్రపైనా హైడ్రా అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్‌వీఎన్‌ సంస్థ మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. దీని వెనక ఓ మాజీమంత్రి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ భూవివాదంపై సమగ్ర విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jun 02 , 2026 | 05:04 AM