Share News

ప్రభుత్వ భూమిలోనే మరో నాలుగు భవనాలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:06 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత ముఖీం, ఆయన సోదరుడు అజీం భూ దందాలో మరిన్ని కొత్త విషయాలను హైడ్రా బయటపెట్టింది...

ప్రభుత్వ భూమిలోనే మరో నాలుగు భవనాలు

  • ఐలాపూర్‌లో సామాన్యులను ముంచిన ముఖీం, అజీం సోదరులు

  • హైడ్రా అధికారుల వెల్లడి.. కొనసాగిన కూల్చివేత పనులు

అమీన్‌పూర్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత ముఖీం, ఆయన సోదరుడు అజీం భూ దందాలో మరిన్ని కొత్త విషయాలను హైడ్రా బయటపెట్టింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం కూల్చేస్తుండగా, దీనిలాగే అజీం మరో నాలుగు అపార్ట్‌మెంట్‌ భవనాలను ప్రభుత్వ భూమిలో నిర్మించి అమాయకులకు ఫ్లాట్లు అంటగట్టి సొమ్ము చేసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కూల్చివేసిన భవనంలో 45 ఫ్లాట్లు ఉండగా, హైడ్రా నోటీసులు జారీ చేయడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏదో ఒక రోజు కూలుస్తారని భావించి, అందులో 20 ఫ్లాట్లను అద్దెకు ఇచ్చి నివాసం ఉంటున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. నివాసాల జోలికి హైడ్రా వెళ్లదన్న ఉద్దేశంతో ఈ ఎత్తుగడ వేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. 2025, జూలై 3న హైడ్రా సదరు అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసులు, స్పీకింగ్‌ ఆర్డర్లను జారీ చేసింది. అజీం దుబాయ్‌లో నివాసం ఉంటూ ఈ ఆదేశాలను పట్టించుకోలేదని అధికారులు చెప్పారు. ఆపరేషన్‌కు ముందు అద్దెకు ఉన్నవారిని ఖాళీ చేయించాలని హైడ్రా అజీంకు సూచించినా ఇంకొంత మందిని తెచ్చి ప్లాట్లలో నింపాడు తప్ప ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో చివరకుఈ నెల 11వ తేదీన కూల్చివేతలు ప్రారంభించామని హైడ్రా పేర్కొంది. కాగా, ఐలాపూర్‌, కిష్టారెడ్డిపేటలో ముఖీం, అజీంల అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు మంగళవారం కూడా కొనసాగాయి. స్వాధీనం చేసుకున్న భూముల చుట్టూ కంచె వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. 80 శాతం కూల్చివేసిన భారీ భవనం పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లకు ప్రమాదకరంగా మారింది. దీనిని పూర్తిగా కూల్చివేస్తేగాని అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో మిగతా నిర్మాణాన్ని సైతం తొలగిస్తామని హైడ్రా సిబ్బంది తెలిపారు.

Updated Date - Apr 15 , 2026 | 05:06 AM