అక్రమ క్రషర్ మిషన్లపై హైడ్రా కొరడా
ABN , Publish Date - May 06 , 2026 | 06:47 AM
అనుమతి లేని క్రషర్ యూనిట్లపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డ (ఓఆర్‌ఆర్) సమీపంలోని పలు ప్రాంతాల్లోని 8 క్రషర్ యూనిట్లను హైడ్రా అధికారులు నేటమట్టం చేశారు.
ఓఆర్‌ఆర్ వెంట 8 క్రషర్ యూనిట్ల నేలమట్టం
మూడు ఆర్‌ఎంసీ ప్లాంట్లు కూడా.. మరో 10 ప్లాంట్లపైనా చర్యలు
అనుమతుల్లేకుండా ఏళ్లుగా నడుస్తున్న ప్లాంట్లు
హైడ్రా చర్యలతో ఆయా ప్రాంతాల ప్రజల హర్షం
హైదరాబాద్ సిటీ/శంషాబాద్ రూరల్, మే 5 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేని క్రషర్ యూనిట్లపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డ (ఓఆర్‌ఆర్) సమీపంలోని పలు ప్రాంతాల్లోని 8 క్రషర్ యూనిట్లను హైడ్రా అధికారులు నేటమట్టం చేశారు. 13 ఆర్‌ఎంసీ ప్లాంట్లలో మూడింటిని కూల్చివేశారు. మరో 10 ప్లాంట్లను తొలగించనున్నట్టు పేర్కొన్నారు. రెవెన్యూ, పీసీబీ, మైనింగ్ విభాగాలు మెన్ అండ్ మెషినరీ సహకారం కావాలని కోరగా.. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న క్రషర్ యూనిట్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి, వట్టి నాగులపల్లి, గోపన్‌పల్లి, శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడలో యేళ్లుగా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్ యూనిట్లను హైడ్రా తొలగించింది. అనుమతి లేకుండా నిర్వహిస్తోన్న ఆయా క్రషర్ యూనిట్ల జోలికి ఇప్పటి వరకు ఏ విభాగం వెళ్లలేదు. రాజకీయ నేతలు, బడా బాబులు బినామీ పేర్లతో వీటిని నడిపిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. హైడ్రా కూల్చివేసిన ఎనిమిది క్రషర్ యూనిట్లలో ఏ ఒక్కదానికి మైనింగ్, పీసీబీ అనుమతులు లేకపోవడం గమనార్హం. గతంలో పలుమార్లు నోటిసులు ఇచ్చినా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఉన్నత స్థాయి నుంచి ఫోన్లు రావడంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. కొత్వాల్‌గూడలో కూల్చివేతలను క్రషర్, రెడ్ మిక్స్ ప్లాంట్ల యాజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. తమకు రెండు రోజులు సమయం ఇస్తే క్రషర్, రెడ్ మిక్స్ ప్లాంట్లు ఎత్తివేస్తామని చెప్పారు. దీంతో రెండు రోజుల సమయం ఇచ్చిన అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
కూల్చివేసిన స్టోన్ క్రషర్లు ఇవే..
భగత్‌సింగ్; ఎస్‌వీకే; పరమేశ్వర; పృథ్వి; గ్రేట్ ఇండియా మైనింగ్; ఆర్ మిల్లర్; తిరుమల మెటల్ ఇండస్ట్రీ; బీఎస్ఆర్; అల్ట్రాటెక్; ఏసీసీ రెడిమిక్స్ ప్లాంట్
గుట్టలు పిండి చేసి..
మహానగరంలో ఇప్పటికే చెరువులు, కుంటలు, కొండలు కనుమరుగయ్యాయి. రాతి గుట్టలను పిండి చేసి ఆ కంకరతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. రాజకీయ, అధికార అండదండలతో అక్రమంగా క్రషర్ యూనిట్లను నిర్వహిస్తున్నా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. క్రషర్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లకు పేర్లు ఉన్నా... అవి ఎవరివి..? అంటే ఆధారాలు లేని పరిస్థితి. తాజా కూల్చివేతల నేపథ్యంలో పర్యావరణ విధ్వంసం ఆగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.