Share News

మరో రూ.5,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా!

ABN , Publish Date - May 31 , 2026 | 06:09 AM

ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడంలో హైడ్రా దూకుడు పెంచింది. శనివారం ఐటీ కారిడార్‌లో ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని సుమారు రూ.5,500 కోట్ల విలువైన భూములను కబ్జా చెర నుంచి....

మరో రూ.5,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా!

  • ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణల తొలగింపు

  • వైఎస్‌ హయాం నుంచే చెరువునుకబళించే ప్రయత్నాలు

  • స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా ఆపరేషన్‌

నార్సింగ్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడంలో హైడ్రా దూకుడు పెంచింది. శనివారం ఐటీ కారిడార్‌లో ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని సుమారు రూ.5,500 కోట్ల విలువైన భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-నార్సింగ్‌ గ్రామాల మధ్య ముష్కిన్‌ చెరువు ఉంది. ఇక్కడ అభివృద్ధి పేరిట చెరువు మధ్యలో మట్టికట్ట నిర్మించారు. దానికి ఒకవైపున ఉన్న ప్రాంతంలో మట్టిని నింపి చదును చేశారు. మొత్తంగా చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 35.10 ఎకరాల భూమి ఆక్రమించారు. తాత్కాలిక షెడ్లు, పేదల గుడిసెలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు సుమారు ఏడాది క్రితం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముష్కిన్‌ చెరువును మట్టితో నింపుతున్నారని.. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో చెరువును అభివృద్ధి చేస్తున్నవారే చెరువు పరిధిని తగ్గించి ఆక్రమణలకు ఆస్కారం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై హైడ్రా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులతో కలిసి విచారణ చేపట్టింది. గ్రామ రికార్డుల మేరకు చెరువు విస్తీర్ణం 59.11 ఎకరాలుగా ఉన్నట్టు గుర్తించింది. అందులో సర్వే నంబరు 259లో 20.23 ఎకరాలు ప్రభుత్వ శిఖం భూమికాగా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో సర్వే నంబర్‌ 258లో 13.34 ఎకరాలు, సర్వే నంబర్‌ 260లో 8.19 ఎకరాలు, సర్వే నంబర్‌ 376లో 12.8 ఎకరాలు, సర్వే నంబరు 379లో 29 గుంటలు భూమి ఉందని తేల్చింది. అయితే కేవలం ప్రభుత్వ శిఖం భూమి 20.23 ఎకరాల మేరకు చెరువు అభివృద్ధి చేస్తున్నారని గుర్తించింది. మిగతా భూమి మొత్తాన్ని రక్షించేందుకు కొన్ని నెలల కిందే ఆపరేషన్‌ చేపట్టింది.


ఒప్పించి.. పంపించి..

పేదల పేరిట గుడిసెలు వేసి భూమిని కొట్టేయాలని రియల్టర్లు చేస్తున్న ప్రయత్నాలను ఆ గుడిసెలలో ఉన్నవారికి హైడ్రా అధికారులు వివరించారు. ఖాళీ చేయాలని నచ్చజెప్పారు. రెండు నెలలు సమయం ఇచ్చారు. చాలా మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగతావారు శనివారం ఖాళీ చేశారు. ఆ వెంటనే గుడిసెలు, షెడ్లను హైడ్రా తొలగించి, చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫెన్సింగ్‌ వేసింది.

వైఎస్‌ హయాంలోనే ప్రణాళిక

ఉమ్మడి రాష్ట్రంలో ముష్కిన్‌ చెరువు పక్కనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థలాలు ఇచ్చారు. కాలనీ నిర్మించారు. మరోవైపు నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌ ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంపై కొందరి కన్నుపడింది. నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుచరులు కొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల సాయంతో చెరువును చెరబట్టారు. ఎఫ్‌టీఎల్‌ హద్దు రాళ్లను తొలగించారు. బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించారు. ఈ క్రమంలో భూవివాదాలు మొదలై కోర్టులకు చేరాయి. వైఎస్‌ మృతి తర్వాత కబ్జాదారులంతా సైలెంట్‌ అయిపోయారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పని మొదలుపెట్టారు. తాజాగా ప్రజల ఫిర్యాదుతో హైడ్రా ఆపరేషన్‌ చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో హైడ్రాను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని.. కానీ ఏమాత్రం లొంగకుండా హైడ్రా ముందుకు వెళ్లిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - May 31 , 2026 | 06:09 AM