Share News

మల్లంపేట టు ప్రగతినగర్‌ రయ్‌ రయ్‌!

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:16 AM

మల్లంపేట వాసులు ప్రగతినగర్‌ వెళ్లేందుకు ఉన్న దూరభారం హైడ్రా చొరవతో తొలగిపోయింది. ‘‘మాది గేటెడ్‌ కమ్యూనిటీ..

మల్లంపేట టు ప్రగతినగర్‌ రయ్‌ రయ్‌!

  • రోడ్డుకు అడ్డంగా గేటెడ్‌ కమ్యూనిటీ వారు నిర్మించిన ప్రహరీని కూల్చివేసిన హైడ్రా

  • 5 కి.మీ మేర తగ్గిన దూరం

నిజాంపేట్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మల్లంపేట వాసులు ప్రగతినగర్‌ వెళ్లేందుకు ఉన్న దూరభారం హైడ్రా చొరవతో తొలగిపోయింది. ‘‘మాది గేటెడ్‌ కమ్యూనిటీ..’’ అని చెబుతూ 40 ఫీట్ల రోడ్డును మూసేసి, ఆ రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా కూల్చివేసింది. తద్వారా అప్పటిదాకా 8కి.మీ ప్రయాణించాల్సిన దూరం 3 కి.మీకి తగ్గిపోయింది. వాస్తవానికి మల్లంపేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ నుంచి బాచుపల్లి క్రాస్‌రోడ్స్‌ మీదుగా ప్రగతినగర్‌కు కేవలం 3 కిలో మీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతుంది. కానీ దారి మధ్యలో ప్రణీత్‌ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడ ఫలితంగా చుట్టూ తిరిగి 8 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ మేరకు రహదారికి అడ్డంగా ప్రణీత్‌ ఆంటిల్యా నిర్మించిన ప్రహరీపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. రహదారికి ఆటంకాలు సృష్టించడంపై ప్రణీత్‌ అంటిల్యా నిర్వాహకులకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రణీత్‌ అంటిల్యా ప్రతినిధులు హై కోర్టును ఆశ్రయించారు. డ్యూ ప్రొసీజర్‌ ఫాలో అవ్వాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది. ఈ మేరకు ఇరుపక్షాలను పిలిచి చర్చించింది. హెచ్‌ఎండీఏ అనుమతించిన ఔట్‌ ప్రకారం అది గేటెడ్‌ కమ్యూనిటీ కాద ని నిర్ధారించుకుంది. గేటెడ్‌ కమ్యూనిటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా దారుల కేటాయింపులు కూడా జరుగలేదని హైడ్రా గుర్తించింది. హైడ్రా అధికారులొచ్చి సోమవారం ప్రహరీ తొలగించారు. ఫలితంగా. మల్లంపేట ఎగ్జిట్‌ నుంచి మల్లంపేట విలేజ్‌, ప్రణీత్‌ లీఫ్‌కాలనీ, ఆకాష్‌ వెంచర్‌, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్‌కాలనీ, బృందావన్‌ కాలనీ, ఏపీఆర్‌ కాలనీ, ఇందిరమ్మకాలనీ, లక్ష్మి శ్రీనివా్‌సకాలనీ, హెచ్‌ఎండీఏ, ప్రణీత్‌ ఆంటిల్యా, బాచుపల్లి చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌కు రావడానికి దారి సుగమం అయింది. అయితే శనివారం నోటీసులిచ్చి.. సోమవారమే ఎలా కూల్చుతారంటూ ప్రణీత్‌ ఆంటిల్యా అసోసియేషన్‌ సభ్యులు, కాలనీవాసులు కూల్చివేతలు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు.

Updated Date - Mar 10 , 2026 | 04:16 AM