Share News

నిర్మాణ దశలోనే షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:07 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో అనుమతుల్లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి ఆ యజమాని అజీమ్‌కు పది నెలల...

నిర్మాణ దశలోనే షోకాజ్‌ నోటీసులు

  • పట్టించుకోకుండా నిర్మాణం పూర్తిచేశారు.. అనుమతుల్లేకుండా ఆరంతస్తుల భవనం

  • హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నా గెస్ట్‌హౌస్‌ నిర్మాణం

  • హైడ్రా ఏర్పడక మునుపు 4 భవనాలు నిర్మించి ఫ్లాట్లు విక్రయించారు.. వాటి జోలికి వెళ్లలేదు

  • గిరిజన తండాలోని ఇళ్లనూ కూల్చలేదు

  • ఐలాపూర్‌ కూల్చివేతలపై హైడ్రా స్పష్టత

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో అనుమతుల్లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవన నిర్మాణానికి సంబంధించి ఆ యజమాని అజీమ్‌కు పది నెలల క్రితం నుంచే పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు (జూలై 19, 2024) నాలుగు అపార్ట్‌మెంట్లను అజీమ్‌ నిర్మించి, ఫ్లాట్లు విక్రయించాడని, వాటి జోలికి హైడ్రా వెళ్లలేదని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ చేపట్టిన భవనానికి నోటిసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టినట్టు పేర్కొన్నారు. నోటీసులు జారీ, అనుమతులు, భూ యాజమాన్యపు హక్కుల నిర్ధారణపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రంగనాథ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నోటీసులివ్వకుండా చర్యలు తీసుకున్నారంటూ భవన యజమానుల ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ప్రకటనలో ఆయన స్పష్టతనిచ్చారు. ఐలాపూర్‌లో నిర్మించిన ఆరంతస్తుల అపార్ట్‌మెంట్‌కు సంబంధించి అనుమతులు ఉంటే చూపించాలని గత ఏడాది జూన్‌ 25న షోకాజ్‌ నోటిసు ఇచ్చినట్లు హైడ్రా పేర్కొంది. గ్రామ పంచాయతీ అనుమతులిచ్చిందని, ఐలాపూర్‌లో కాదు.. కిష్టారెడ్డిపేటలో భవనం నిర్మిస్తున్నామని అజీమ్‌ సమాధానమిచ్చాడని, అనుమతి పత్రాలను మాత్రం సమర్పించలేదని హైడ్రా స్పష్టం చేసింది. అజీమ్‌ సమాధానంపై సమగ్ర విచారణ జరిపి.... పంచాయతీ, మునిసిపాలిటీ నుంచి ఎక్కడా అనుమతులు తీసుకోలేదని నిర్ధారణకు వచ్చామని.. అక్రమ నిర్మాణాన్ని వారే తొలగించాలని సూచిస్తూ అదే ఏడాది జూలై 3న స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు, 15 రోజుల వ్యవధిలో స్పందించకపోతే కూల్చివేస్తామని, అందుకయ్యే ఖర్చు భవన యజమానే భరించాల్సి ఉంటుందని ఆ ఆర్డర్‌లో స్పష్టం చేసినట్లు వెల్లడించింది. అయితే షోకాజ్‌ నోటిస్‌, స్పీకింగ్‌ ఆర్డర్‌ను పట్టించుకోకుండా ఆరంతస్తులతో భవన నిర్మాణం పూర్తి చేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హైడ్రా నోటిసుల జారీ విషయం తెలియడంతో అపార్ట్‌మెంట్‌లలో ఉన్న 45 ఫ్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని, దీంతో అనుచరులు, తెలిసిన వ్యక్తుల కుటుంబాలను తీసుకొచ్చి 20 ఫ్లాట్లలో అజీమ్‌ ఉంచాడని, నివాసాల జోలికి హైడ్రా వెళ్లదనే ఉద్దేశంతో ఈ వ్యూహం రచించినట్లు హైడ్రా పేర్కొంది. అయితే వారంతా అద్దెకున్న వారేనని నిర్ధారించుకొని.. ఆ కుటుంబాలను ఖాళీ చేయించాలని భవన యజమానికి మరోసారి నోటిసులిచ్చినట్లు వెల్లడించింది. అయినా వారిని ఖాళీ చేయించకుండా.. మరికొన్ని కుటుంబాలను ఆ ఫ్లాట్లలోకి తీసుకువచ్చే పనిలో అజీమ్‌ నిమగ్నమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి, ఈ నెల 11వ తేదీన రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు శాఖలతో కలిసి కూల్చివేతలు చేపట్టినట్లు వెల్లడించింది.


హైకోర్టు స్టే ఆర్డర్‌ ఖాతరు చేయకుండా...

ఐలాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 1 నుంచి 220 వరకు 1263 ఎకరాల భూమి స్వరూపం మార్చొద్దని 1998, 2013లో హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉందని హైడ్రా పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలు పట్టించుకోకుండా ముఖీం గెస్ట్‌హౌ్‌సతోపాటు 40 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ నిర్మించాడని పేర్కొంది. గెస్ట్‌హౌస్‌ తొలగించి.. 40 ఎకరాల ఫామ్‌హౌ్‌సకు హైడ్రా ఫెన్సింగ్‌ వేసినట్టు , ఆ తర్వాత ఆరంతస్తుల భవనం కూల్చివేశామని పేర్కొంది. సర్వే నంబర్‌ 119లోని గిరిజన తండాలో ఇళ్లను కూల్చలేదని, ఈ విషయాన్ని న్యాయస్థానంకు వివరించినట్లు స్పష్టం చేసింది.

Updated Date - Apr 15 , 2026 | 05:07 AM