Share News

హైడ్రాకు ఉన్న అధికారమేంటి?

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:39 AM

హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం ఆ సంస్థ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఏయూడీ) ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, కానీ దాని అనుమతి లేకుండా హైడ్రా ఏకపక్షంగా పనులు చేపడుతున్నట్లు ...

హైడ్రాకు ఉన్న అధికారమేంటి?

  • నోటీసులివ్వకుండా కూల్చేస్తారా?

  • ఆక్రమణే అయినా నోటీసివ్వాలి

  • హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు..

  • జీవో ప్రకారం ఎంఏయూడీ ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలి: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం ఆ సంస్థ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఏయూడీ) ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, కానీ దాని అనుమతి లేకుండా హైడ్రా ఏకపక్షంగా పనులు చేపడుతున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో 99 ప్రకారం ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉండే హైడ్రాకు ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్‌గా ఉండాలని పేర్కొంది. అయితే మొత్తంగా పర్యవేక్షణ బాధ్యత ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శికే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని ప్లాట్‌ నంబర్‌ 213, 217లో ప్రహరి గోడ కూల్చేశారంటూ జీ రాహుల్‌ యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా, ఎంఏయూడీ అనుమతి లేకుండా ఎలా చర్యలు తీసుకున్నారని, హైడ్రాకు ఉన్న అధికారం ఏంటని ప్రశ్నించింది. ప్రతి సందర్భంలో ఎంఏయూడీ అనుమతి పొందాల్సిన అవసరం లేదని హైడ్రా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయని నోటి మాట ద్వారా ఫిర్యాదు అందినా సదరు ఆస్తికి ఫెన్సింగ్‌ వేసి బోర్డు ఏర్పాటుచేసే అధికారం హైడ్రాకు ఉందన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆక్రమణలే అయినా చర్యలు తీసుకునే ముందు నోటీసు ఇవ్వాలి. తెలంగాణ ల్యాండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌ యాక్ట్‌-1905 సైతం ఇదే చెబుతోంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ విషయంలో హైడ్రా చర్యలను అభినందిస్తున్నాం. అయితే చర్యలు తీసుకునే ముందు రెవెన్యూ రికార్డులు పరిశీలించి, సహజ న్యాయసూత్రాల ప్రకారం వ్యవహరించాలి. హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం చూసినా వివాదాస్పద లేదా ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్‌ వేయడానికి ముందు హైడ్రా వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి కదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్‌ చెబుతున్నట్లు సివిల్‌ కోర్టులో ఉన్న కేసులో ప్రస్తుత ప్లాటు ఉంటే కనుక హైడ్రా వేసిన ఫెన్సింగ్‌ను 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.

Updated Date - Feb 12 , 2026 | 02:42 AM