గాలి కెరటాలలో..
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:29 AM
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు వెళ్లి హుస్సేన్ సాగర్‌లో విమానం ఎక్కి.. ఆకాశం నుంచి బుద్ధ విగ్రహం, రాష్ట్ర సచివాలయం, పరిసర ప్రాంతాలను చూస్తూ.. కృష్ణా నది..
హుస్సేన్‌సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా సీ-ప్లేన్
ఆ విమానం నీళ్లపై నుంచే టేకాఫ్.. నీళ్లపైనే ల్యాండింగ్
సీ-ప్లేన్ పర్యాటకంపై ఇప్పటికే ఏపీ దృష్టి.. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ
క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఎయిర్‌పోర్టు అథారిటీ
హైదరాబాద్, ఆగష్టు 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌కు వెళ్లి హుస్సేన్ సాగర్‌లో విమానం ఎక్కి.. ఆకాశం నుంచి బుద్ధ విగ్రహం, రాష్ట్ర సచివాలయం, పరిసర ప్రాంతాలను చూస్తూ.. కృష్ణా నది పరివాహక ప్రాంతాల మీదుగా ప్రకృతి అందాలను విహంగ వీక్షణం చేస్తూ.. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ల్యాండ్ అయ్యి.. బెజవాడను చుట్టొస్తే ఎలా ఉంటుంది!. ఆ ఫీల్ వేరే లెవల్!. అనిపిస్తుంది కదా!!. ఆ అనుభూతిని నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సీ-ప్లేన్ టూరిజం’పై దృష్టి సారించింది. హుస్సేన్‌సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో ఇటీవల ఢిల్లీలో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ‘సీ-ప్లేన్’ టూరిజంతో తెలంగాణ-ఏపీల మధ్య కొత్త టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందని ఇరువురు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రకాశం బ్యారేజీకి ‘సీ-ప్లేన్’ సేవలు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) బృందం నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. సీ-ప్లేన్’ అంటే నీళ్లపై నుంచే టేకాఫ్ అయి, నీళ్లలోనే ల్యాండ్ అవుతుంది. అందువల్ల హుస్సేన్‌సాగర్‌లో సీ-ప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలు, వాటి పాయింట్ల ఖరారుతో పాటు ప్రయాణికుల రాకపోకలకు ఎటువైపు ఏర్పాట్లు చేయాలన్న దానిపై ఏఏఐ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. అలాగే ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా టేకాఫ్, ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలు, ఇతరత్రా ఏర్పాట్లపై ఏఏఐ బృందం త్వరలో పరిశీలన చేయనుంది. అనంతరం ప్రాజెక్టు నివేదికను రెండు ప్రభుత్వాలకు సమర్పించనున్నట్టు తెలిసింది.
పర్యాటకానికి కొత్త ఊపు!
సీ-ప్లేన్‌లు సాధారణ విమానాలకు భిన్నంగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా రన్ వే ఉండదు. నీటిపైనే దిగి, నీటిపై నుంచే ఎగురుతాయి. అయితే సరైన లోతులో నీళ్లు ఉండాలి. టేకాఫ్, ల్యాండింగ్ కోసం వాటర్ ఏరోడ్రోమ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. సీ-ప్లేన్‌లో తక్కువమంది ప్రయాణికులే ఉంటారు. ప్రాథమిక అంచనా ప్రకారం 9-12 మందితోనే ప్రయాణం ఉంటుంది. అలాగే హుస్సేన్‌సాగర్‌లో మొదలై.. కృష్ణా పరీవాహక ప్రాంతం మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు ప్రయాణం సాగనుంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే తెలంగాణ-ఏపీ మధ్య పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల మధ్యన ‘సీ-ప్లేన్’ టూరిజం ఆలోచన గతం నుంచే ఉంది. దీనిపై ఇప్పటికే ట్రయల్ రన్‌లు జరగడం తెలిసిందే.