ట్రాఫిక్, నిద్రలేమితో ఏటా 198 గంటలు వృధా
ABN , Publish Date - Aug 10 , 2026 | 06:16 AM
పెరుగుతున్న ట్రాఫిక్, రాత్రి సమయంలో పెరిగిన ఉష్ణోగ్రతలతో నిద్రలేమి కారణంగా... హైదరాబాదీలు ఏడాదిలో దాదాపు 198 గంటలు కోల్పోతున్నారని రెండు వేర్వేరు సంస్థలు చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది.
హైదరాబాదీలపై టామ్‌టామ్, క్లైమేట్ సెంట్రల్ సర్వేల్లో వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న ట్రాఫిక్, రాత్రి సమయంలో పెరిగిన ఉష్ణోగ్రతలతో నిద్రలేమి కారణంగా... హైదరాబాదీలు ఏడాదిలో దాదాపు 198 గంటలు కోల్పోతున్నారని రెండు వేర్వేరు సంస్థలు చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. టామ్‌టామ్ ట్రాపిక్ ఇండెక్స్ సర్వే తాజా నివేదిక ప్రకారం హైదరాబాదీలు సగటున ఏడాదికి 123 గంటలు ట్రాఫిక్‌లో కోల్పోతున్నారని తేలింది. గడిచిన దశాబ్ద కాలంలో నగరంలో జనాభా పెరిగినా, వాహనాల సంఖ్య రెట్టింపైనా అందుకు తగ్గట్టు రోడ్ల విస్తరణ జరగకపోవడంతో సమస్యను తీవ్రతరం అవుతోందని నివేదికల్లో వెల్లడైంది. ప్రజారవాణా వ్యవస్థ సామర్థ్యం కూడా తగిన విధంగా పెరగలేదని నివేదిక తేల్చింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా ఉండగా.. 10కి.మీ. ప్రయాణించడానికి సగటున 32.7 నిమిషాలు పడుతోంది. సాయంత్రం, పీక్ అవర్స్‌లో ఇంతే దూరం వెళ్లడానికిసగటున 39.5 నిమిషాలు పడుతోంది. దీంతో హైదరాబాదీలు సగటున ఏడాదికి 123 గంటలు కోల్పోతున్నారని నివేదిక తేల్చింది. వాతావరణ మార్పులు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం నగరవాసుల జీవన శైలిపై ప్రభావం చూపుతోందని అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1338 నగరాలపై విశ్లేషణ జరిపింది. దక్షిణ భారతంలోని పలు నగరాల్లో వాతావరణ మార్పులు, రాత్రి సమయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిద్ర సమయం తగ్గిపోతుందని విశ్లేషించింది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరాల్లో కాంక్రీట్, రోడ్లు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు గ్రహించి, రాత్రి వేళల్లో విడుదల చేయడం వల్ల.. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీని కారణంగా ఆయా నగరాల్లోని ప్రజలు ఏడాదికి 70 నుంచి 90 గంటల నిద్రను కోల్పోతున్నారని తెలిపింది. హైదరాబాదీలు సగటున 75 గంటల నిద్రను కోల్పోతున్నారని క్లైమేట్ సెంట్రల్ నివేదికలో వెల్లడించింది.