హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:51 AM
దేశ రక్షణ రంగ ప్రగతికి దోహదపడేలా హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కోరారు.
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ రంగ ప్రగతికి దోహదపడేలా హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో ఎంపీ మల్లు రవితో కలిసి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్‌ను ఆయన కార్యాలయంలోనే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ కారిడార్‌పై గతంలోనే ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారని కార్యదర్శికి వారు గుర్తుచేశారు. ఈ కారిడార్ రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ (స్వదేశీ తయారీ) లక్ష్యాన్ని సాధించడంతో సహా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని వివరించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ హబ్‌లను, బెంగళూరులోని ఏరోస్పేస్ యూనిట్లను కలుపుతూ ఒక సమగ్ర పారిశ్రామిక జోన్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు.