Share News

అసెంబ్లీ వెనుక ‘వై’ ఫ్లైఓవర్‌!

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:11 AM

హైదరాబాద్‌ మహానగరంలో మరో ఫ్లైఓవర్‌ రానుంది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకి అధికమవుతోంది. ముఖ్యంగా కోర్‌ సిటీలోని నాంపల్లి- అసెంబ్లీ- లక్డీకాపూల్‌ మార్గం నిత్యం రద్దీగానే ఉంటుంది.

అసెంబ్లీ వెనుక ‘వై’ ఫ్లైఓవర్‌!

  • పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు

  • 1.5 కిలోమీటర్ల మార్గం, వై ఆకారంలో వంతెన

  • మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌వైపు అనుసంధానం

  • డిజైన్‌, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్‌ఎండీఏ

  • ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణానికి కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహానగరంలో మరో ఫ్లైఓవర్‌ రానుంది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకి అధికమవుతోంది. ముఖ్యంగా కోర్‌ సిటీలోని నాంపల్లి- అసెంబ్లీ- లక్డీకాపూల్‌ మార్గం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఈ రహదారి హైదరాబాద్‌- విజయవాడ రహదారి కావడం, నగరంలోని కీలక ప్రాంతాలను కలుపుతుండడంతో వాహన రద్దీ సర్వసాధారణంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో రాత్రి వేళల్లోనూ ట్రాఫిక్‌ సమస్య ఉంటుంది. ఇక, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినప్పుడైతే ఈ రహదారిలో ప్రయాణించే వారికి నానాపాట్లు తప్పవు. ఈ నేపథ్యంలో అక్కడి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఆ మార్గంలో ఓ ఫ్లైఓవర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్‌ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున ఆంగ్ల అక్షరం ‘వై’ ఆకారంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ డిజైన్‌ సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ను సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల్లోనే నిర్మించే విధంగా డిజైన్‌ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్తుల సేకరణకు వెళ్తే కోర్టు కేసులు, ఇతర వివాదాలు తలెత్తుతుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వ భూముల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి సర్వే కూడా హెచ్‌ఎండీఏ పూర్తి చేసినట్లు తెలిసింది. 99 శాతం వరకు ప్రైవేటు ఆస్తులు అవసరం లేకుండా ఫ్లైఓవర్‌ను డిజైన్‌ చేసినట్లు సమాచారం.

ప్రతిపాదిత ఫ్లైఓవర్‌ మార్గం ఇదే..!

నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ మీదుగా అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్‌ వెంట ఫ్లైఓవర్‌ రానుంది. లక్డీకాపూల్‌ వద్దకు రాగానే ప్లైఓవర్‌ రైల్వే లైన్‌ మీద నుంచి లక్డీకాపూల్‌ జంక్షన్‌ దాటనుంది. ఇక్కడే ఫ్లైఓవర్‌ రెండుగా చీలి ఒక మార్గం మాసబ్‌ ట్యాంక్‌ వైపు, మరో మార్గం ఖైరతాబాద్‌ వైపు రోడ్డుకు అనుసంధానం అవుతుంది. సైదాబాద్‌ పోలీసు స్టేషన్‌ కంటే ముందే లక్డీకాపూల్‌ ప్రధాన రహదారిపై ప్లైఓవర్‌ చేరనుంది. కాగా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చే వాహనదారులు ఖైరతాబాద్‌ వైపు కానీ, మాసబ్‌ట్యాంకు వైపు సులువుగా వెళ్లేలా ఫ్లైఓవర్‌ను వై ఆకారంలో డిజైన్‌ చేశారు. ఈ ప్లైఓవర్‌పై నాంపల్లి నుంచి వచ్చే వాహనదారులకు మాత్రమే అనుమతివ్వనున్నారు. ఖైరతాబాద్‌, మాసబ్‌ట్యాంకు నుంచి వచ్చే వాహనదారులకు అనుమతి లేకుండా వన్‌వేగా ఉంచనున్నారు.

Updated Date - Jun 12 , 2026 | 05:11 AM