కలుసుకుందాం.. పరిచయాలు పెంచుకుందాం
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:47 AM
ఒకప్పుడు కొత్త పరిచయం కావాలంటే డేటింగ్ యాప్‌లు తెరిచేవారు. కానీ.. ఇటీవలికాలంలో అలాంటి స్ర్కీన్ పరిచయాలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతున్నట్లే ఉంది.
డేటింగ్ యాప్స్‌ను దాటి ప్రత్యక్ష పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్న హైదరాబాద్‌యువత
రకరకాల సోషలైజింగ్ ఈవెంట్స్‌కు హాజరు
డిజిటల్ డేటింగ్‌తో తీవ్ర మానసిక అలసట
ఫోర్బ్స్ హెల్త్ సర్వేలో 78-80శాతం మంది వెల్లడి
ఆన్‌లైన్ చాటింగ్స్ వల్ల సమయం వృథా
బంబుల్, టిండర్ ‘ఇయర్ ఇన్ స్వైప్’ నివేదికల
ప్రకారం 82శాతం మందిది ఇదే అభిప్రాయం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కొత్త పరిచయం కావాలంటే డేటింగ్ యాప్‌లు తెరిచేవారు. కానీ.. ఇటీవలికాలంలో అలాంటి స్ర్కీన్ పరిచయాలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతున్నట్లే ఉంది. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ హెల్త్ సర్వే ప్రకారం 78-80శాతం మిల్లీనియల్స్, జెన్ జీ యువత తాము డిజిటల్ డేటింగ్ వల్ల తీవ్రమైన మానసిక అలసటకు గురవుతున్నామంటున్నారు. అలాగే డేటింగ్ యాప్‌లు బంబుల్, టిండర్‌లు విడుదల చేసిన ‘ఇయర్ ఇన్ స్వైప్’ నివేదికల ప్రకారం హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో దాదాపు 82శాతం మంది సింగిల్స్ ఆన్‌లైన్‌లో చాటింగ్‌ల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని, సమయం వృధా అవుతుందని చెబుతున్నారు. ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడి, ఆ తర్వాత ఆ పరిచయాన్ని ఎంతవరకూ తీసుకెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు. దీంతో.. కాఫీ టేబుల్స్ కలయికకు వేదికలవుతున్నాయి. బోర్డ్ గేమ్స్ పరిచయాలకు ఆలంబనగా మారుతున్నాయి. పుస్తకాల గురించిన చర్చలు... పెయింటింగ్‌తో పదనిసలు.. తెలియని వాళ్లతో చిన్న ట్రిప్పులు ట్రెండ్‌గా మారుతున్నాయి.
మ్యాచ్ కోసం కాదు.. మనుషుల కోసం..
డేటింగ్ అనగానే ఇప్పటికీ ఎన్నో యాప్‌లు... వెబ్‌సైట్‌లు.. వాటిలో కనిపించే అందమైన యువతీయువకుల చిత్రాలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ ఊరిస్తూ ఉంటాయి. నచ్చితే స్వైప్.. అభిరుచులు కలిస్తే చాటింగ్.. ఆ తరువాత ప్రత్యక్ష పరిచయం.. ఇలా సాగేది. కానీ ఫేక్ ప్రొఫైల్స్ పెరిగిపోవడం, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం అకౌంట్లు సృష్టించడం, సైబర్ స్కామ్స్ వల్ల ఇప్పుడు డేటింగ్ యాప్‌లంటేనే భయపడే స్ధితికి చాలామంది వచ్చేశారు. దీనికి తోడు, ఒక పరిచయాన్ని నిలబెట్టుకోవడానికి గంటల తరబడి చాటింగ్ చేసేంత తీరిక కూడా ఉండటం లేదు. అందుకే ‘‘ముందు కలుద్దాం.. మాట్లాడుకుందాం.. తరువాత పరిచయం ఎంత వరకూ తీసుకువెళ్లాలో చూద్దాం’’ అనే ఆలోచనతో ఆఫ్‌లైన్ మీట్ అప్స్ అంటున్నారు. సోషల్ సెయిలర్, ది హ్యాపీ అవర్, స్మాల్ వరల్డ్, లెట్స్ సోషలైజ్ లాంటి కమ్యూనిటీలు వారాంతాలలో నిర్వహించే సింగిల్స్ మీటప్స్, స్పీడ్ డేటింగ్, స్పీడ్ ఫ్రెండింగ్, సోషల్ మిక్సర్స్, బోర్డ్ గేమ్స్, ఇతర యాక్టివిటీ ఆధారిత కార్యక్రమాలకు క్యూ కడుతున్నారు. ఈ తరహా కార్యక్రమాలకు వచ్చేవారి ప్రొఫైల్‌ను ధ్రువీకరించాకే ప్రవేశం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా సమయం వృథా కాదన్నది చాలా మంది యువత అభిప్రాయం. ‘‘ఒకప్పుడు మీకు ఎవరు నచ్చుతారనేది ప్రశ్న. కానీ.. ఇప్పుడు మీతో ఏం చేయడం నచ్చుతుందన్నది ముఖ్యం. అందుకే నగరంలో యాక్టివిటీ ఆధారిత మీట్‌పలకు ఆదరణ పెరిగింది. ఓ పరిచయం స్నేహంగా మారవచ్చు.. మరింత దగ్గర బంధమూ కావొచ్చు. ఇక్కడ డేటింగ్ అనేది అప్రస్తుతం. మనకు నచ్చిన పనిచేస్తూ వెళ్తే మనకు నచ్చే మనుషులు ఎదురవుతారు’’ అంటున్నారు వారు.
సోషల్ లైఫ్‌కు సై..
డేటింగ్ అంటే, ఎన్నో భయాలు, మరెన్నో ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటాయి. అదే ఓ సాఽధారణ సమావేశం.. లేదంటే, ఒకే తరహా అభిరుచులు కలిగిన వారి కలయిక అంటే, ఎలాంటి అంచనాలు, ఒత్తిళ్లూ ఉండవు. పరిచయం సహజంగానూ మారుతుంది. ఈ భావనే జెన్ జీ మొదలు మిలీనియల్స్ వరకూ ఆఫ్‌లైన్ మీట్‌ప్సకు జై కొట్టేలా చేస్తోంది. బంబుల్ ఇండియా డేటింగ్ ట్రెండ్ కూడా ఇదే చెబుతోంది. జెన్ జీలో ఎక్కువ మంది ఒకే తరహా ఆసక్తులను పంచుకోవడాన్ని సాన్నిహిత్యానికి ముఖ్యమైన రూపంగా చూస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి యువత అందం కంటే, అభిరుచి ముఖ్యమంటోంది. ఇది ఇటీవలి కాలంలో కనిపిస్తోన్న పెద్ద మార్పుగానే చూడాల్సి ఉంటుందన్నది ఈ రంగంలో ఉన్న వారిమాట. డేటింగ్ యాప్‌లో అయితే ముందు ఫోటో కనిపిస్తుంది.. అదే ఆఫ్‌లైన్ మీట్‌పలలో అయితే ముందుగా అవతలి వ్యక్తి కనిపిస్తారు. అదే పెద్ద తేడా! చాటింగ్‌లో ఆలోచనలకు మాస్క్ వేయొచ్చు. నేరుగా కలుసుకున్నప్పుడు అలా కుదరదు. ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు మనం మనలా సహజంగా ఉండగలమా లేదా తెలిసిపోతుంది. ఇలా కారణాలేవైనాగానీ.. ఒకప్పుడు మనుషుల కోసం యాప్ ఓపెన్ చేసిన యువతే.. ఇప్పుడు మనసుల కోసం తలుపులుతెరుస్తుండటం గొప్ప మార్పే! ఇక్కడ ప్రేమ పుడుతుందో లేదో తెలియదు కానీ, మనిషికి మనిషి చేరువవుతున్నాడని మాత్రం వాస్తవం.
నో గిల్ట్ డచ్ కల్చర్‌తో ఖర్చులూ సమానం
డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు కట్టాలనే సందిగ్ధం ఉంటుంది. ఒక్కరే మొత్తం చెల్లించాలా, ఇద్దరూ పంచుకోవాలా.. అడిగితే ఏమవుతుందోననే మీమాంస వెంటాడుతూనే ఉంటుంది. మీట్‌పలలో అలాంటి సంకోచాలేమీ లేవు. ఎవరో ఒకరు బిల్లించే విధానం లేదిక్కడ. ఎవరి ఖర్చు వాళ్లదే! బిల్లు సగం... బాధ్యత సగం అనే భావన యువతను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘నో గిల్ట్ డచ్ కల్చర్’ అని చెబుతున్న ఈ విధానం.. తొలిసారి అపరిచితులను కలిసినప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటోందని చాలామంది చెబుతున్నారు.