ముగ్గురిని కాపాడి.. చేపల వలలో చిక్కుకొని అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:02 AM
అమెరికాలోని సెబాన్ నదిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన కోడూరు అనురూ్‌పరెడ్డి(23) ప్రాణాలు కోల్పోయాడు. నదిలో మునిగిపోతున్న...
నదిలో మునిగిపోయి మృత్యువాత
అబ్దుల్లాపూర్‌మెట్/ శాలిగౌరారం, మే31 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని సెబాన్ నదిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన కోడూరు అనురూ్‌పరెడ్డి(23) ప్రాణాలు కోల్పోయాడు. నదిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడిన అనురూప్.. ఈ క్రమంలో చేపల వలలో చిక్కుకుని నీట మునిగి మరణించారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లికి చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గా భవాని దంపతుల చిన్న కుమారుడు అనురూ్‌పరెడ్డి 2024లో అమెరికా వెళ్లాడు. యూనివర్సీటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన అనురూప్ నెల క్రితం డిగ్రీ పట్టా అందుకున్నారు. ఓ టెక్ కంపెనీలో రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. మరో వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అయితే, అనురూ్‌పరెడ్డి శనివారం తన స్నేహితులు ఆరుగురితో కలిసి అమెరికా, లూసియానాలోని టోరోడో పార్కు వద్ద సెబాన్ నదికి వెళ్లారు. అనురూ్‌పరెడ్డితో పాటు మరో ముగ్గురు నదిలోకి దిగారు. మిగిలిన వాళ్లు ఒడ్డున ఉన్నారు. నదిలోకి దిగిన ముగ్గురు స్నేహితులు కొంచం లోతులోకి వెళ్లి నీటి మునిగారు. అనురూ్‌పరెడ్డికి ఈత రావడంతో వెంటనే వారిని ఒడ్డుకు లాగారు. అనురూప్‌రెడ్డి ఒడ్డుకు చేరే క్రమంలో చేపల వేట కోసం నదిలో వేసిన ఓ వల అతడి కాళ్లకు చుట్టుకుంది. దీంతో ఈత కొట్టలేక పోయిన అనురూప్ రెడ్డి.. స్నేహితులు చూస్తుండగానే మునిగిపోయారు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారంతో అనురూప్ రెడ్డి మృతదేహం జూన్ 6న కవాడిపల్లికి రానుంది.