Nikhita: అమెరికాలో యువతి హత్య
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:01 AM
తెలుగమ్మాయి గొడిశాల నిఖిత అమెరికాలో దారుణ హత్యకు గురైంది. కొత్త సంవత్సర వేడుకల నుంచి కనిపించకుండాపోయిన ఆమె..
మృతురాలి స్వస్థలం హైదరాబాద్‌లోని తార్నాక... కత్తితో పొడిచి హత్య చేసిన మాజీ రూమ్‌మేట్
హైదరాబాద్ సిటీ/తార్నాక, న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలుగమ్మాయి గొడిశాల నిఖిత అమెరికాలో దారుణ హత్యకు గురైంది. కొత్త సంవత్సర వేడుకల నుంచి కనిపించకుండాపోయిన ఆమె.. జనవరి 3న మేరీల్యాండ్‌లోని తన మాజీ రూమ్ మేట్ అర్జున్ శర్మ అపార్టుమెంట్‌లో విగతజీవిగా కనిపించింది. నిజానికి, నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ జనవరి 2న హార్వర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే అతడు భారత్‌కు వెళ్లిపోయాడు. దాంతో, నిఖితను అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. భారత అధికారుల సమన్వయంతో ఇంటర్‌పోల్ అధికారులు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని విజయపురి కాలనీకి చెందిన నిఖిత 2016-21 వరకు జేఎన్‌టీయూలో ఫార్మసీ చదివారు. ఆ తర్వాత కిమ్స్ ఆస్పత్రిలో కొంత కాలం పని చేశారు. నాలుగేళ్ల కిందట ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఎంఎస్ అయిపోగానే అక్కడే వేడా హెల్త్ సైన్స్ సంస్థలో డేటాఅండ్‌స్ట్రాటజీ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలి అన్నందుకేనా!?
వెయ్యి డాలర్లు తిరిగి ఇవ్వాలన్న వివాదం కారణంగానే నిఖిత హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిత కజిన్ గొడిశాల సరస్వతి పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం.. అర్జున్ శర్మ అనే యువకుడు నిఖితకు మాజీ రూమ్‌మేట్. నిఖితను, తనను అతను డిసెంబరు 27న డబ్బులు అడిగాడని, తాను అతనికి 4,500 డాలర్లు పంపించానని, అందులో 3500 డాలర్లు అతడు తిరిగి ఇచ్చేశాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత మళ్లీ జనవరి రెండో తేదీన ఫోన్ చేశాడని, మరో వెయ్యి డాలర్లు ఇవ్వాలని అర్జున్ శర్మ అడిగాడని సరస్వతి పేర్కొన్నారు. దానికి తాను నిరాకరించానని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు మిగిలిన వెయ్యి డాలర్లు ఇవ్వాలంటూ డిసెంబరు 31న అర్జున్ శర్మను నిఖిత అడిగారని పేర్కొన్నారు. తనకున్న సమాచారం మేరకు నిఖిత చివరి సారిగా అర్జున్‌తోనే కలిసి ఉన్నారని, ఆమె కారు కూడా అతని రూమ్ వద్దనే ఉందని చెప్పారు. ఆ తర్వాత న్యూ ఇయర్ పార్టీ తర్వాత నిఖిత కనిపించడం లేదంటూ అతడే 2న హార్వర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3న కొలంబియాలోని ట్విన్ రివర్ రోడ్‌లో అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అర్జున్ శర్మ అత్యంత కిరాతంగా నిఖితను దారుణంగా పొడిచి హతమార్చి ఫిర్యాదు చేసిన రోజే (జనవరి 2న) అమెరికా నుంచి ఇండియాకు పారిపోయినట్లు గుర్తించారు. అంతేనా.. దానికి ముందు నిఖిత బ్యాంకు ఖాతాల నుంచి 3500 డాలర్ల లావాదేవీలు జరిపినట్లు కూడా గమనించారు. చేతికి గాయమైందని, అర్జంటుగా శస్త్ర చికిత్స చేయించుకోవాలంటూ ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీలు భారతీయ అధికారులకు కేసు వివరాలు తెలిపాయి. అతడు తమిళనాడులో ఉన్నట్లు గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని అమెరికా తరలించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం.
త్వరగా భారత్‌కు మృతదేహం: కిషన్ రెడ్డి
నిఖిత హత్యపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. హత్య విషయం తెలిసిన వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడానని, వీలైనంత త్వరగా నిఖిత మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం రాత్రి నిఖిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిఖిత తన స్నేహితుడికి కొంత డబ్బు అప్పు ఇచ్చిందని, దానిని తిరిగి అడిగినందుకే ఆమెను హత్య చేసినట్లు తెలిసిందని చెప్పారు.
తార్నాకలో విషాద ఛాయలు
నిఖిత దారుణ హత్య విషయం తెలియడంతో విజయపురి కాలనీలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబరు 31 రాత్రి తమకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిందని, ఇంతలోనే దుర్వార్తను వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని నిఖిత తండ్రి ఆనంద్ విలపించారు. అర్జున్ శర్మ ఆమె మాజీ రూమ్‌మేట్ అని.. అందరి వద్ద అప్పులు చేసి ఇండియాకు వెళుతున్నాడనే సమాచారంతో తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగేందుకు డిసెంబరు 31వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో నిఖిత అతని రూమ్‌కు వెళ్లిందని, అక్కడ వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతోనే అర్జున్ శర్మ కత్తితో పొడిచి నిఖితను చంపినట్లు మీడియా లో వచ్చిన వార్తల ద్వారా తమకు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. తన కుమార్తె మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఙప్తి చేశారు.