Share News

ప్రేమించానని వెంటపడి.. పెళ్లయ్యాక నరకం చూపించాడు!

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:58 AM

తాను అవివాహితుడనని, ప్రేమిస్తున్నానని, తన కోసం మతం కూడా మార్చుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని.. మతం మార్చుకోకపోగా..

ప్రేమించానని వెంటపడి.. పెళ్లయ్యాక నరకం చూపించాడు!

  • మతం మార్చుకుంటాననీ నమ్మించాడు.. భర్తపై ఓ యువతి ఆరోపణ

  • మత్తు ఇచ్చి సోదరులు, స్నేహితులతో కలిసి అత్యాచారం

  • మతం మార్పించి.. ఖురాన్‌ చదవాలని తీవ్ర ఒత్తిడి

  • ఇది ముమ్మాటికీ లవ్‌ జిహాదే

  • అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు.. మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన

పంజాగుట్ట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తాను అవివాహితుడనని, ప్రేమిస్తున్నానని, తన కోసం మతం కూడా మార్చుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని.. మతం మార్చుకోకపోగా.. అతడు ఉల్టా తన మతాచారాలనే బలవతంగా రుద్దుతూ తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లితో కలిసి బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంది. తాను ఓ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నానని, కూకట్‌పల్లిలో తల్లి, సోదరితో కలిసి నివాసముం టున్నానని వెల్లడించింది. తమ ఇంటి కింద షెట్టర్‌ను ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్‌ అనే వ్యక్తికి అద్దెకిచ్చామని.. అతడు తనతో పరిచయం పెంచుకొని, ప్రేమిస్తున్నట్లుగా చెప్పాడని.. తన కోసమే పేరును నవాజ్‌ నుంచి నవదుర్గగా మార్చుకున్నట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా చూపించాడని వివరించింది. నిరుడు జూలైలో తామిద్దరం రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని తెలిపింది. తర్వాత అతడికి అంతకుముందే రెండు పెళ్లిళ్లు అయినట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు తనకు తెలిసిందని బాధితురాలు వివరించింది. అయితే తనతో పెళ్లికి ముందు, పెళ్లయ్యాక ఓ గెస్ట్‌హౌ్‌సలో బేగంపేటలోని ఇంట్లో నవాజ్‌, మత్తుమందు ఇచ్చి సోదరులు, స్నేహితులతో కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. కర్ణాటకలోని గుల్బర్గాలో ఖాజా నవాజ్‌ దర్గాకు తీసుకెళ్లి తనతో బలవంతంగా మతం మార్పించి.. పేరును నజీరాగా మార్చాడని చెప్పింది. తన అత్త, ఇతర కుటుంబసభ్యులు తనతో ఖురాన్‌ సూక్తులు, కల్మా చదివించారని, చదవకపోతే చేయి కూడా చేసుకున్నారని ఆరోపించింది. తాము సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి తనను నవాజ్‌ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని.. తన తల్లిని, సోదరిని చంపుతానని బెదిరించేవాడని ఆరోపించింది. తనను ఇతరులతో ఫోన్‌లో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదని, చివరికి అతడి వల్ల ఉద్యోగం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. గత జనవరిలోనే నవాజ్‌ దురాగతాలపై తాను కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశానని వెల్లడించింది. అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు అతడి వద్ద ఉండటంతోనే ఇన్ని రోజులూ వేధింపులను మౌనంగా భరించానని.. అయితే తనలా మరెవ్వరూ మోసపోవొద్దనే ఉద్దేశంతోనే మీడియా ముందుకొచ్చినట్లు తెలిపింది. నవాజ్‌ తనను ట్రాప్‌ చేశాడని, ఇది కచ్చితంగా లవ్‌ జిహాదేనని.. అతడు, అతడి సోదరులు కూడా హిందూ అమ్మాయిలను ట్రాప్‌ చేస్తున్నారని ఆరోపించింది. నవాజ్‌ను, అతడి సోదరులను, తల్లిదండ్రులను కఠినంగా శిక్షించి.. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

Updated Date - Apr 17 , 2026 | 03:58 AM