Share News

వాటర్‌ ట్యాంకర్లకు యాప్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:18 AM

వేసవిలో హైదరాబాద్‌ మహా నగర ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు రానివ్వం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక ప్రాంతానికి ఎక్కువ..

వాటర్‌ ట్యాంకర్లకు యాప్‌

  • ట్యాంకర్‌ బుక్‌ చేసుకున్నాక 8-10 గంటల్లోనే డెలివరీ

  • డిమాండ్‌ పెరిగినా 24గంటల్లో సరఫరా

  • హైదరాబాద్‌ అంతా నీటి సరఫరాపై నిఘా

  • వేసవిలో ముందస్తు ప్రణాళికలు

  • క్యూర్‌ వరకు నీటి సరఫరా, సీవరేజ్‌ నిర్వహణపై దృష్టి

  • ఫిర్యాదులపై స్పందించకుంటే చర్యలు

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘వేసవిలో హైదరాబాద్‌ మహా నగర ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు రానివ్వం. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక ప్రాంతానికి ఎక్కువ.. మరో ప్రాంతానికి తక్కువ నీరు సరఫరా గాకుండా ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాం.వాటర్‌ ట్యాంకర్ల ట్రాకింగ్‌కు కొత్తగా యాప్‌ తీసుకురానున్నాం’’ అని వాటర్‌బోర్డు (హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డు) మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది వేసవిలో ముందస్తుగా వాటర్‌బోర్డు చేపట్టిన చర్యలతో ట్యాంకర్ల డిమాండ్‌ రోజుకు 11వేలకు చేరినా.. 24 గంటల్లోనే సరఫరా చేశామని, ఈసారి డిమాండ్‌ మరింత పెరిగినా.. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వాటర్‌బోర్డు పరిధిని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ వరకు విస్తరించిన నేపథ్యంలో రానున్న వేసవిలో తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యులో ఆయన వివరించారు.

వేసవికి వాటర్‌బోర్డు యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి?

వేసవి వచ్చేసరికి బోర్లు, బావుల్లో నీటి మట్టం పడిపోతుంది. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీటితోనే అపార్ట్‌మెంట్లు, ఇళ్ల అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా ట్యాంకర్ల బుకింగ్‌లు పెరిగాయి. ఈ పరిస్థితులను అంచనా వేసుకొని తాగునీటి సరఫరాకు క్షేత్ర స్థాయిలో మైక్రో లెవల్‌ ప్రణాళికలు రూపొందించుకున్నాం. హైదరాబాద్‌ వ్యాప్తంగా నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. సమయపాలన పాటిస్తూ.. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడతాం.

గత ఏడాదికి, ఇప్పటికీ డిమాండ్‌ పెరిగిందా?

హైదరాబాద్‌లో ఏడాదికేడాది డిమాండ్‌ పెరగడమే తప్ప.. తగ్గేది ఉండదు. ఈ నెల మొదటి వారంలో రోజుకు 4200 ట్యాంకర్ల బుకింగ్‌లు జరగ్గా.. ప్రస్తుతం అది 5,400కు పెరిగింది. ఏ రోజు ట్యాంకర్‌ అదే రోజు డెలివరీ చేస్తున్నాం. త్వరలో ఫిల్లింగ్‌ స్టేషన్లను పెంచుతాం. వేసవిలోనూ 8-10 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే రాత్రి వేళల్లో కూడా ట్యాంకర్లను డెలివరీ చేస్తాం. 24గంటల్లోనే ట్యాంకర్‌ డెలివరీ జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాం.


ట్యాంకర్ల డెలివరీలో మార్పులు తెస్తున్నారా?

ట్యాంకర్‌ బుక్‌ చేశాక.. వినియోగదారుడికి ఏ సమయానికి చేరుతుందో నిర్దిష్టంగా సమాచారం ఉండడం లేదు. ఆ సమస్యను నివారించేందుకు ఫిల్లింగ్‌స్టేషన్‌ నుంచి ట్యాంకర్‌ బయలుదేరే ముందు వినియోగదారుడికి మేస్సేజ్‌ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఫుడ్‌ డెలివరీ యాప్‌ల మాదిరిగా ఒక యాప్‌ను తీసుకొస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్‌రన్‌ సాగుతోంది. మరో పది రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. ట్యాంకర్‌ బుకింగ్‌ చేశాక.. ఎంత క్యూ ఉంది? ఎంత సమయంలో రాబోతుంది? అనే సమాచారం కూడా అందిస్తాం.

వాటర్‌ బోర్డు పరిధి ‘క్యూర్‌’ వరకు పెరిగింది కదా.. సేవలు ఎలా అందిస్తారు?

వాటర్‌బోర్డు పరిధిని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) వరకు విస్తరించిన మాట వాస్తవమే. అయితే, ఔటర్‌ అవతలి ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా నీరందిస్తున్నారు. ఇప్పటిదాకా స్థానిక మునిసిపాలిటీలే దీన్ని పర్యవేక్షించాయి. వాటన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకొని మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లు తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. మరో నెలలోగా క్యూర్‌ పరిధి వరకు తాగునీటి సరఫరాకు ప్లాన్‌ చేస్తున్నాం. సీవరేజ్‌ నిర్వహణను కూడా త్వరలోనే చేపడతాం.

గోదావరి ఫేజ్‌-2, 3 పనులెలా సాగుతున్నాయి?

గోదావరి ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 1100 మిలియన్‌ లీటర్ల నీటిని అందించాలని, జంట జలాశయాలను నింపి మూసీ పునరుజ్జీవం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్‌లో ప్రతి రోజూ నీటి సరఫరా చేయొచ్చు. వేసవి వస్తే నీళ్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. 2027 డిసెంబరు నాటికి గోదావరి ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

నీటి సరఫరాలో ఇబ్బందులను ఎలా అధిగమిస్తారు?

ఒక ఏరియాకు ఎక్కువ, మరో ఏరియాకు తక్కువ నీరు అందుతున్న విషయాన్ని ఇటీవల గమనించాం. కొందరు ఉద్యోగులు డబ్బు తీసుకుని ఆ విధంగా పని చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నీరు ఏ ప్రాంతానికి ఎంతివ్వాలి? ఎన్ని గంటలు సరఫరా చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాం. సమయపాలన పెడుతున్నాం. రోజువారీగా పర్యవేక్షించడానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి.. నిఘా పెడతాం. ఒక చోట ఎక్కువ, మరో చోట తక్కువ నీరు అందినట్లు తేలితే.. సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదులపై సిబ్బంది స్పందించడం లేదు కదా?

వాటర్‌బోర్డుకు వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం. ఇందుకోసం ప్రతీ ఫిర్యాదుకు టోకెన్‌ నెంబర్‌ ఇవ్వడంతో పాటు పరిష్కరించిన తర్వాత ఫిర్యాదుదారుడికి సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. జోనల్‌, సర్కిళ్లు, డివిజన్ల వారీగా అధికారులను నియమించాం. ఫిర్యాదులపై స్పందించకుంటే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తమ పరిధి కాదని దాటెయ్యడానికి అవకాశం లేకుండా పకడ్బందీగా ప్లాన్‌ చేశాం.

Updated Date - Feb 20 , 2026 | 08:02 AM