Share News

ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేయండి

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:44 AM

ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని...

ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేయండి

  • ప్రక్రియను పరిశీలించిన సీఈఓ సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓ), సహాయ ఎన్నికల నమోదు అధికారుల (ఏఈఆర్‌ఓ)ను ఆదేశించారు. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి శనివారం సికింద్రాబాద్‌, చార్మినార్‌ నియోజకవర్గాల్లోని మాణికేశ్వరినగర్‌, కబూతర్‌ ఖానా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రొజెన్సీ మ్యాపింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని బూత్‌ లెవల్‌ అధికారులు, సూపర్‌ వైజర్లకు ఆయన సూచించారు. ఓటరు జాబితాలో కచ్చితత్వం, పారదర్శకత, సమగ్రత పాటించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ‘సర్‌’ ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి 2002 ఓటర్ల జాబితాలోని కుటుంబ సభ్యుల వివరాలను 2025 జాబితాలోని పేర్లతో పోల్చుతున్నట్టు ఎన్నికల సిబ్బంది చెప్పారు.

Updated Date - Feb 22 , 2026 | 06:46 AM