District Reorganization: రెవెన్యూ, పోలీస్, బల్దియా ఒకటే పరిధి!
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:03 AM
హైదరాబాద్‌లో కోర్ అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థలన్నింటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో విలీనమైన 27 మున్సిపాలిటీలను .......
రాజధాని కోర్ అర్బన్ జిల్లాల సరిహద్దులు మార్పు
హైదరాబాద్‌ను విభజించి సికింద్రాబాద్ జిల్లా?
రంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్‌లో విలీనం
సంగారెడ్డిలో కొన్ని ప్రాంతాలు రంగారెడ్డిలో విలీనం
మల్కాజిగిరిగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
మొదలైన కసరత్తు... ఫిబ్రవరిలో అమలులోకి
పాలనా సౌలభ్యం, మెరుగైన పౌర సేవల కోసమే..
హైదరాబాద్ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కోర్ అర్బన్ ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థలన్నింటికీ ఒకటే భౌగోళిక పరిధి ఉండేటట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో విలీనమైన 27 మున్సిపాలిటీలను కలుపుకొని మొత్తం కోర్ అర్బన్‌గా పరిగణించిన ప్రభుత్వం అందులో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఆ సరిహద్దులతోనే త్వరలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటువుతున్నాయి. ఇక రెవెన్యూ వ్యవస్థను కూడా ఆ కార్పొరేషన్ల పరిధికి అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని జిల్లాల సరిహద్దులు మారతాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి జిల్లాలకుతోడు అవసరమైతే హైదరాబాద్‌ను రెండు ముక్కలు చేసి కొత్త జిల్లా సికింద్రాబాద్ ఏర్పడుతుంది. అంటే, రెవెన్యూ, పోలీస్, బల్దియా మూడింటి పరిధి ఒకేరకంగా ఉంటుందన్న మాట. ఏ వ్యవస్థ కూడా మూడు కార్పొరేషన్ల పరిధులను దాటి రెండు కార్పొరేషన్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మూడింటితోపాటు హైదరాబాద్ జలమండలి జోన్లు, డివిజన్లు, హైదరాబాద్‌కు విద్యుత్ అందిస్తున్న సదరన్ డిస్కమ్‌లోని సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్లు కూడా సరిగ్గా మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో ఉండేలా సర్దుతారు. మెరుగైన పౌర సేవలు లక్ష్యంగా, ఏకీకృత పాలనా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వాటర్, విద్యుత్ క్షేత్రస్థాయి విభాగాలన్నీ ఒకే పరిధిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంటుందని, ఉన్నత, జోనల్ స్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణలో ఇబ్బందులు ఉండవని అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం జోన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తే సరిహద్దుల అస్పష్టత వల్ల చాలామంది అధికారులు సమావేశాలను ఎగ్గొడుతున్నారు. 2,071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కోర్ అర్బన్ ప్రాంతాన్ని ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లుగా విభజించారు. ఫిబ్రవరి 10 తరువాత అదే పరిధితో మునిసిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి.
సికింద్రాబాద్ జిల్లా...?
సికింద్రాబాద్ నుంచి బోరబండ, పంజాగుట్ల, ఖైరతాబాద్ తూర్పు వైపు, తార్నాక, అంబర్‌పేట, కోర్ ఏరియా, పాత నగరంలోని ప్రాంతాలతో పాటు శంషాబాద్ వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఉంది. ఇవే ప్రాంతాలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఏర్పాటు చేయనున్నారు. ఇదే సరిహద్దులతో హైదరాబాద్ జిల్లా ఏర్పాటు చేస్తారు. జీహెచ్‌ఎంసీ ఆరు జోన్లను ఆరు డివిజన్లుగా పరిగణిస్తూ మొత్తం కార్పొరేషన్‌ను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. హైదరాబాద్ జిల్లా పెద్దగా ఉంద ని భావిస్తే రెవెన్యూ పరిపాలనా సౌలభ్యం కోసం మూడు డివిజన్లకొక జిల్లా చొప్పున రెండు జిల్లాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే హైదరాబాద్, సికింద్రాబాద్ పేరిట రెండు జిల్లాలు ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ జిల్లాలో చేరతాయి.
రంగారెడ్డిలో సైబరాబాద్ కార్పొరేషన్
ఐటీ కారిడార్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌గా ఏర్పడ్డాయి. ఇక్కడి మెజార్టీ ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా పరిధిలోనివే. పటాన్‌చెరు, అమీన్‌పూర్, తెల్లాపూర్, ముత్తంగి ఏరియాలు సంగారెడ్డి జిలాలో ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని ఒకే జిల్లాలో ఉంచాలని భావిస్తే రంగారెడ్డి పేరును కొనసాగించే అవకాశం ఉంది. అమీన్‌పూర్, పటాన్‌చెరు తదితర ప్రాంతాలను రంగారెడ్డిలో కలిపేసి, మిగిలిన ప్రాంతాలతో సంగారెడ్డి జిల్లా యథాతధంగా ఓఆర్‌ఆర్ బయట కొనసాగనుంది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్ల పరిధి మల్కాజ్‌గిరి కమిషనరేట్‌గా ఉంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని ఈ ప్రాంతాలతో మల్కాజ్‌గిరి జిల్లా ఏర్పాటు చేస్తారని సమాచారం.
మూడుగా జల మండలి
హైదరాబాద్ జల మండలి ఓఆర్‌ఆర్ లోపల 1,450 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతానికి తాగునీరు అందిస్తోంది. దాన్ని కోర్ అర్బన్ ప్రాంతం మొత్తానికి విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో జలమండలిని కూడా మూడుగా విభజిస్తారు. సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ల పునర్వ్యవస్థీకరణ చేపడతారు. ప్రస్తుతం బోర్డులో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఉన్నారు. మూడుగా విభజించే బోర్డులకు ముగ్గురు ఈడీలు ఉంటారు. మొత్తం బోర్డు పరిధిలో మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పర్యవేక్షణ ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమిస్తారు. నగరానికి విద్యుత్ అందించే సదరన్ డిస్కమ్ పరిధిలో కూడా సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్లు కూడా మూడు కార్పొరేషన్ల పరిధిలో సర్దుతారు.