బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:15 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. చిన్న రోగానికి కూడా పెద్ద ఆస్పత్రులకు పరుగులు తీసే అవస్థలు తప్పనున్నాయి.
ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్‌తో పట్టణ పేదల చెంతకు స్పెషలిస్ట్ వైద్యులు
కోర్ అర్బన్ పరిధిలోని 145 కేంద్రాల అప్‌గ్రేడ్
176 మంది వైద్యులతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓపీ
గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో సేవలు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. చిన్న రోగానికి కూడా పెద్ద ఆస్పత్రులకు పరుగులు తీసే అవస్థలు తప్పనున్నాయి. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను పాలీ క్లినిక్‌లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి ‘ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్’ అనే పేరు పెట్టింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిలోఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల నిపుణులతో బస్తీల్లోనే సేవలందించనున్నారు. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సామాన్యుడికి నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను మార్చనుంది. ఇందులో భాగంగా కోర్ అర్బన్ పరిధిలోని 145 కేంద్రాలను ‘స్పెషలిస్ట్ పాలీ క్లినిక్‌లు’గా అప్‌గ్రేడ్ చేసింది. సాధారణ జ్వరం, జలుబుకే పరిమితం కాకుండా.. ఇకపై గుండె, ఎముకలు, గైనకాలజీ, పిల్లల వైద్యం వంటి 8 రకాల ప్రత్యేక విభాగాల నిపుణులు నేరుగా ఈ కేంద్రాల్లోనే రోగులను పరీక్షించనున్నారు.
4 జిల్లాల్లో ేసవలు.. 24 క్లస్టర్లుగా విభజన
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 136.09 లక్షల మంది (38.88ు) పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ప్రణాళికారహితంగా పెరిగిన నగరాల కారణంగా వలస కార్మికులు, పేదలు నివసించే బస్తీల్లో అంటువ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో చిన్న సమస్య వచ్చి నా నిపుణులైన డాక్టర్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి పేదలు అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జాతీయ ఆరోగ్యవిధానం-2017, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్-2022 నిబంధనల ప్రకారం ఈ పాలీ క్లినిక్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లా ల్లో ఈ సేవలను అందించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 91 కేంద్రాలు, మేడ్చల్ జిల్లాలో 28 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 25 కేంద్రాలు, సంగారెడ్డిలో ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొత్తం 145 కేంద్రాలను 24 క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్ పరిధిలోకి 6 యూపీహెచ్‌సీలను తీసుకువచ్చారు.
176 మంది స్పెషాలిటీ వైద్యులు..
ఈ ప్రాజెక్ట్ కోసం ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి 176 మంది స్పెషలిస్టులు, సీనియర్ రెసిడెంట్లను రంగంలోకి దించారు. జనరల్ మెడిసిన్ 27, సర్జరీ 24, గైనకాలజీ 26, పీడియాట్రిక్స్ 25, పల్మనరీ మెడిసిన్ 24, ఆర్థోపెడిక్స్ 26 మంది నిపుణులు వారానికి ఒకసారి ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. అలాగే ఈఎన్‌టీ 12, కంటి వైద్య నిపుణులు 12 మంది రెండు వారాలకు ఒకసారి ేసవలందిస్తారు. ఈ పాలిక్లినిక్‌లలో రోగులకు సరిపడా సమయం కేటాయించేలా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిపుణుల ఓపీ ేసవలు కొనసాగుతాయి. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల సీనియర్ ప్రొఫెసర్లు స్వ యంగా ఈ సేవల నాణ్యతను పర్యవేక్షించనున్నారు. దీనివల్ల గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆస్పత్రులకు అనవసరమైన రెఫరల్స్ తగ్గి, అక్కడ కూడా రోగులపై ఒత్తిడి తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పట్టణ పేదలకు ఇదొక గొప్ప వరంగా మారుతుందని, జేబుల నుంచి ఖర్చు పెట్టే అవస్థ తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.