Share News

ఆరంతస్తులు దాటితే హైరైజ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:20 AM

హై-రైజ్‌ భవనాల్లో టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌-బదలాయించదగిన అభివృద్ధి హక్కులు) వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఆరంతస్తులు దాటితే హైరైజ్‌

  • 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకు వర్తింపు

  • హైరైజ్‌ భవన నిబంధనల్లో కీలక మార్పులు

  • 10-20 అంతస్తుల వరకూ 3శాతం.. 20 పైన 5శాతం టీడీఆర్‌ తప్పనిసరి

  • టీడీఆర్‌ వినియోగానికి కొత్త మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): హై-రైజ్‌ భవనాల్లో టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌-బదలాయించదగిన అభివృద్ధి హక్కులు) వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పట్టణాభివృద్థి రంగంలో పారదర్శకత, ప్రణాళికాబద్థ అభివృద్థి, భవన నిర్మాణ ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా.. భవన నిర్మాణ నిబంధనలకు సంబంధించి కీలక సవరణలు చేస్తూ సర్కారు జీవో నం.95 జారీ చేసింది. దీని ప్రకారం.. 21 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను హైరైజ్‌ భవనాలుగా పరిగణిస్తారు. కానీ, ఎత్తు కొలవడానికి.. పారిశ్రామిక భవనాల్లో అయితే చిమ్నీలు, కూలింగ్‌ టవర్లు, బాయిలర్‌ గదులు, లిఫ్ట్‌ మెషీన్‌ గదులు, కోల్డ్‌ స్టోరేజ్‌లను, ఇతర భవనాల్లో అయితే నీటి ట్యాంకులు, నిర్మాణపరమైన డిజైన్లను పరిగణనలోకి తీసుకోరు.


  • 750 నుంచి 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్లలో 18-21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు కట్టుకోవాలంటే కచ్చితంగా టీడీఆర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. పార్కింగ్‌, ఇతర నిబంధనలు పాటించడం తప్పనిసరి.

  • హై-రైజ్‌ కాని సాధారణ భవనాల విషయంలో.. రోడ్డు విస్తరణకు సంబంధించిన కనీస సెట్‌బ్యాక్‌లను పాటిస్తూ మిగిలిన సడలింపుల కోసం టీడీఆర్‌ వినియోగించుకోవచ్చు. అదే హై-రైజ్‌ భవనాల్లో అయితే, నిర్ణీత సెట్‌బ్యాక్‌లలో 10 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. కానీ, భవనం చుట్టూ 7మీటర్ల ఖాళీ స్థలం కచ్చితంగా ఉండాలి.

  • మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల మార్పు లేదా తొలగింపు జరిగితే, సంబంధిత చార్జీలను చెల్లించడం లేదా సమానమైన టీడీఆర్‌ సమర్పించడం ద్వారా పరిష్కారం పొందవచ్చు.

  • 2000 చ.మీ. కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతులు ఇస్తారు.

  • 40 అడుగుల రోడ్డు ఉంటే 3 అంతస్తులు, 60 అడుగులు ఉంటే 4 అంతస్తులు, 80 అడుగులు ఉంటే 5 అంతస్తుల వరకూ అదనంగా నిర్మించుకోవచ్చు. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు, ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉంటే దానికి సంబంధించిన నిబంధనలను పాటించాలి.

  • 10 నుంచి 20 అంతస్తుల భవన నిర్మాణాలుంటే.. 10వ అంతస్తుపైన ఉన్న మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 3ు మేర, 20 అంతస్తుల కంటే ఎక్కువ భవనాల్లో 20వ అంతస్తు పైన 5 శాతం మేర టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి. 50 శాతం టీడీఆర్‌ను భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేసే సమయంలో, మిగతా 50ు టీడీఆర్‌ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి ముందు సమర్పించాలి.

Updated Date - Mar 23 , 2026 | 05:21 AM