Share News

6 నెలల తర్వాతే ట్రై కార్పొరేషన్లకు ఎన్నికలు!

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:30 AM

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి(ట్రై కార్పొరేషన్లు) మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని..

6 నెలల తర్వాతే ట్రై కార్పొరేషన్లకు ఎన్నికలు!

  • అప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలన?

  • నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి(ట్రై కార్పొరేషన్లు) మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఆరు నెలల తర్వాతే అవకాశం ఉంటుందని, అప్పటివరకు ప్రత్యేక అధికారులు పాలనా వ్యవహారాలను నిర్వహిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వర్షాకాలం తర్వాతనే ఈ మూడు మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు ఉంటాయన్నారు. ఉద్యోగులు, అధికారుల విభజన, విధుల కేటాయింపు తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మూడు కార్పొరేషన్లలో పౌర సేవల్లో కీలకమైన డిజిటల్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కార్యాలయాల ఆధునికీకరణ, ఫర్నీచర్‌ సమకూర్చుకోవడం పూర్తి కాలేదు. మరోవైపు, బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 16న ముగుస్తాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎ్‌సఐఆర్‌) ప్రారంభమవుతుందని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. మే నెలలో జనగణన మొదలు కానుంది. ఇందులో భాగంగా మొదట కుటుంబాల వివరాలు సేకరించనున్నారు. ఎస్‌ఐఆర్‌, జనగణన పూర్తయ్యేందుకు 2, 3నెలలు పడుతుందని అంచనా. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇది ప్రారంభం కానుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇంకో ఆరు నెలల వరకు ఎన్నికల నిర్వహణకు వీలు కాదు.

బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపు అప్పుడే

ఎస్‌ఐఆర్‌, జనగణన పూర్తయిన తరువాతే ఈ మూడు మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించే అవకాశముంది. ఈ లెక్కన ఆగస్టు లేదా సెప్టెంబరులో ట్రై కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మొదలవ్వాలి. అయితే, ముందు వార్డుల వారీగా బీసీ ఓటర్ల గుర్తింపునకు సర్వే నిర్వహిస్తారు. ఆ సంఖ్య ఆధారంగా ఆయా వర్గాలకు ఎన్ని వార్డులు కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీ వార్డుల రిజర్వేషన్లనూ అప్పుడే కేటాయిస్తారు. దీనికి 2-3వారాల సమయం పట్టనుంది. అప్పటికే వర్షాకాలం మొదలవడంతో నగరంలో వరద సమస్య, డెంగీ, మలేరియా, ఇతర జ్వరాల వ్యాప్తి వంటివి ఉంటాయి. ఆ సమయంలో ఎన్నికలను నిర్వహిస్తే అధికార పార్టీకి ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి నవంబరు లేదా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అంచనా.

Updated Date - Feb 25 , 2026 | 01:30 AM