హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు!
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:27 AM
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కుత్భుల్లాపూర్ పరిధిలో మంగళవారం ఒక్కసారిగా భూప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది.
గాజులరామారం ప్రాంతంలో ఘటన
ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం.. నిర్ధారించని అధికారులు
షాపూర్‌నగర్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కుత్భుల్లాపూర్ పరిధిలో మంగళవారం ఒక్కసారిగా భూప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. ముఖ్యంగా గాజుల రామారం ప్రాంతంలోని మెట్‌కానీగూడ, ఆదర్శనగర్ ప్రాంతాల్లో రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 10గంటల సమయంలో భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఉన్న వస్తువులు కదలడం, ఇళ్లలో సామగ్రి కిందపడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఈ అకస్మాత్తు పరిణామంతో అప్రమత్తమైన స్థానిక పాఠశాల విద్యార్థులు, కాలనీ వాసులు పెద్దగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా.. లేదా మరేదైనా పేలుడు ప్రభావమా.. అన్నది తెలియక ప్రజలు ఆందోళన చెందారు. కాగా, ఈ ఘటన పై తహశీల్దార్ అశోక్ కుమార్ స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. భూకంపం సంభవించిందని ఇంకా నిర్ధారణ కాలేదని, మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని ధ్రువీకరించాల్సి ఉందని చెప్పారు.