Share News

స్టీరింగ్‌ తిప్పరు..గేరు మార్చరు!

ABN , Publish Date - May 19 , 2026 | 04:44 AM

మరో నెల రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను తరలించే వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

స్టీరింగ్‌ తిప్పరు..గేరు మార్చరు!

  • కూర్చున్న చోటునుంచే స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ

  • ప్రైవేటు విద్యా సంస్థల వాహనాల విషయంలో రవాణా శాఖ నిర్లక్ష్యం

  • అలాంటి వాహనాలు అధికారికంగా 8 వేలు.. అనధికారికంగా రెండింతలు

  • నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పరిమితికి మించి పిల్లల తరలింపు

  • కనిపించని ప్రథమ చికిత్స కిట్లు.. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు

  • విద్యార్థుల భద్రతతో చెలగాటం.. గతంలో పలుచోట్ల ప్రమాదాలు

  • కొత్త విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫిట్‌నెట్‌ పరీక్షలు

  • వాహనాల కండిషన్‌, డ్రైవర్ల సామర్థ్యాన్ని నిరంతరం పరీక్షించాలనే డిమాండ్లు

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): మరో నెల రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను తరలించే వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తనిఖీలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లా రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపారు. అయితే విద్యార్థులను తరలించే వాహనాలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ప్రైవేటు స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలు పాటించకపోయినా ఆ వాహనాలకు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్‌ సర్టిపికెట్లు జారీచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులను తరలించే బస్సు, వ్యాను, మ్యాక్సిక్యాబ్‌ ఇతర వాహనాలను తొలుత గ్యారేజీకి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించాలి. సంబంధిత పత్రాలను తీసుకొని వాహనంతోపాటు రవాణా శాఖ కార్యాలయానికి రావాలి. అప్పుడు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) వాహనాన్ని స్వయంగా నాలుగు కి.మీ నడిపి పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉందా.. లేదా? అని నిర్ధారించాలి. వాహనంలో నిబంధనల మేరకు సీటింగ్‌ ఉందా? బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా? అత్యవసర ద్వారం ఉందా? ప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థులు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చే ఏర్పాట్లు ఉన్నాయా? ప్రథమ చికిత్స కిట్‌ బాక్సును అమర్చారా.. లేదా? అగ్నిమాపక పరికరం ఉందా.. లేదా? ఇలా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ రవాణా శాఖ అధికారులు చాలా వరకు కనీసం వాహనం కూడా చూడకుండానే తమ కార్యాలయంలో కుర్చీలో కూర్చుని కిందిస్థాయి సిబ్బంది ఓకే చేసి తెచ్చిన కాగితాలపై సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కిందిస్థాయి సిబ్బంది మొదలు జిల్లా రవాణా శాఖ అధికారుల నుంచి ప్రధాన కార్యాలయం వరకు ఎక్కడికక్కడ లంచాలు తీసుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక కొద్ది రోజులు తనిఖీల పేరుతో హడావుడి చేసే రవాణా శాఖ అధికారులు ఆ తర్వాత పత్తాలేకుండా పోతున్నారు. నిరంతరం వాహనాల తనిఖీలు చేస్తేనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.


రోడ్లపై అంతకు రెండింతలు

రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలకు (పాఠశాలలు, కళాశాలలు) సంబంధించి సుమారు 8 వేల వాహనాలు విద్యార్థులను తరలిస్తున్నాయి. ఇందులో బస్సులు, వ్యాన్లు, మినీ క్యాబ్‌లు ఉన్నాయి. అనధికారికంగా రెండింతలకుపైగా వాహనాలు విద్యార్థులను తరలిస్తున్నట్లు సమాచారం. ఆటోలు, ఇతర చిన్నపాటి వాహనాల్లోనూ విద్యార్థులను తరలిస్తున్నారు. ఆటోల్లో విద్యార్థులను కుక్కించి తరలిస్తున్న ఘటనలు తరచూ పోలీస్‌, రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తూనే ఉంటాయి. జిల్లా కేంద్రాల్లో ఆటోలు, ట్రాక్టర్లలోనూ విద్యార్థులను తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓమినీ వంటి మినీ క్యాబ్‌లో డిక్కీల్లోనూ విద్యార్థులను కుక్కి కూర్చోబెడుతున్నారు. టాప్‌పైన స్కూల్‌ బ్యాగులు ఉంచి తరలిస్తుంటారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు తమ వాహనాల వివరాలను తప్పనిసరిగా రవాణా శాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త విద్యాసంస్థలు సొంత వాహనాలతో ట్రాన్స్‌పోర్టు నిర్వహిస్తుండగా మరికొందరు థర్డ్‌ పార్టీ ద్వారా ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేటుగా ఎవరి ఇష్టానికి వారు వాహనాల్లో విద్యార్థులను తరలిస్తుంటారు. నర్సరీ నుంచి ఇంజనీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులను తరలించే వరకు వాహనాల్లో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదు. హైదరాబాద్‌ శివారులో ఉన్న ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు కాలం చెల్లిన సుమో, క్వాలీస్‌ వంటి వాహనాల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, బస్సులు కండిషన్‌, డ్రైవర్ల సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదాలెన్నో..

వాహనాలు ఫిట్‌గా లేకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండటం, డ్రైవర్‌ నిర్లక్ష్యం, వాహనంపై అదుపుకోల్పోవడం... ఇలా కారణం ఏదైనా రాష్ట్రంలో తరచూ విద్యా సంస్థల వాహనాలు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి.

  • ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులుగూడెంలో ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు పరిమితికి మించి విద్యార్థులతో వెళ్తుండగా అదుపుతప్పి పంట కాలువలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు.

  • కొత్తగూడెం పాల్వంచలో ఇంజనీరింగ్‌ కాలేజీ బస్సు అశ్వాపురం మొండికుంట వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు.

  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ నుంచి నార్సింగివైపు విహారయాత్రకు వెళ్తున్న స్కూల్‌ బస్సు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

Updated Date - May 19 , 2026 | 04:44 AM