లంచాలు తీసుకుంటే సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:12 AM
రవాణా శాఖలో అవినీతి... దళారులు, సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్’లపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘1..2..3.. అంటే ఏసీబీ..!’ శీర్షికతో వచ్చిన కథనం, సీఎంవో ఆరా నేపథ్యంలో..
‘కోడ్’లు వాడితే సిబ్బందిపై చర్యలు.. సీసీ కెమెరాలన్నీ పనిచేయాల్సిందే
ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ విజిలెన్స్ జేటీసీ చంద్రశేఖర్
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో అవినీతి... దళారులు, సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్’లపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘1..2..3.. అంటే ఏసీబీ..!’ శీర్షికతో వచ్చిన కథనం, సీఎంవో ఆరా నేపథ్యంలో.. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకునే సిఇబ్బందిని తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఉపయోగిస్తున్న ‘కోడ్’లకు స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ప్రధాన కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు.. టెస్టింగ్ ట్రాక్‌లు, ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల పనితీరులో మార్పు, ఏజెంట్ల ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు పలు ఇతర కీలక అంశాలకు సంబంధించి రవాణా శాఖ విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ టెస్ట్ షెడ్యూల్ చేసిన రోజున దరఖాస్తుదారుడు కచ్చితంగా ట్రాక్ వద్ద హాజరుకావాలని, పరీక్ష ప్రారంభించే ముందు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో దరఖాస్తుదారుడి గుర్తింపును స్వయంగా ధ్రువీకరించాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం..
‘‘ప్రైవేటు ఏజెంట్లకు ప్రవేశం నిషేధం’ అనే బోర్డు ప్రతి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ప్రవేశం వద్ద పెట్టాలి.
దరఖాస్తుదారును కేవలం స్టీరింగ్ వీల్ వెనుక కూర్చోబెట్టడం, లేదా నామమాత్రపు దూరం వాహనం నడిపించి పరీక్ష పాస్ చేయడం కుదరదు. వారు వాహనాన్ని స్టార్ట్ చేయడం నుంచి.. రివర్స్ తీసుకోవడం, లేన్ డిసిప్లిన్, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అన్ని విభాగాల్లో సంతృప్తికరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి.
రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న ప్రతీ సీసీ కెమెరా పనిచేయాలి. ప్రైవేటు ఏజెంట్లు కనిపించినా... సీసీ కెమెరాలు పనిచేయకపోయినా నిఘా పరికరాల్ని ట్యాంపరింగ్ చేసినా, నిలిపి వేసినా సంబంధిత కార్యాలయ అధికారులపై చట్టప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవు.
డ్రైవింగ్ ట్రాక్ పరిసరాల్లోకి, రవాణా కార్యాలయాల్లోకి బ్రోకర్లు, ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధుల్ని అనుమతించకూడదు.
వేటు వేస్తాం..
ఏజెంట్లకు సహకరించినా, వారి నుంచి లంచాలు తీసుకున్నా.. బాధ్యులైన సిబ్బందిపై విచారణ పెండింగ్‌లో ఉంచి తక్షణమే సస్పెండ్ చేస్తామని జేటీసీ హెచ్చరించారు. ఏసీబీ బృందాలు, సీనియర్ అధికారుల రాకను ముందుగానే గుర్తించి సిబ్బందిని అలెర్ట్ చేసేందుకు కోడ్, సంకేతాలు, నంబర్ సీక్వెన్స్‌లు ఉపయోగించవద్దన్నారు. తమ పరిధిలో ఇలాంటి చర్యలకు తావులేకుండా చూసే పూర్తి బాధ్యత కార్యాలయ అధికారులదేనన్నారు. ప్రతి నెలా 15వ నాటికి కమిషనర్ కార్యాలయానికి మంత్లీ కాంప్లయన్స్ నివేదిక సమర్పించాలని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.