Share News

మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి!

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:06 AM

మామిడిపండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఆస్పతిపాలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో...

మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి!

హిమాయత్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మామిడిపండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఆస్పతిపాలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో భువనేశ్వరి(17) అనే బాలిక సోమవారం మరణించగా.. ఆమె సోదరి సంధ్య(10) మంగళవారం కన్నుమూసింది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వీరి మృతికి గల కారణంపై స్పష్టత వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వైజినాథ్‌, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి విఠల్‌వాడిలో నివాసముంటున్నారు. వైజినాథ్‌ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ కుటుంబానికి బంధువైన రేణుక అనే ఆమె ఇటీవల వీరి ఇంటికి వస్తూ నారాయణగూడలోని జలమండలి కార్యాలయం సమీపంలో మామిడి పండ్లు కొనుగోలు చేసి తెచ్చారు. ఇందుమతి, ఆమె నలుగురు కుమార్తెలు ఆ మామిడిపండ్లను తిన్నారు. ఆదివారం సాయంత్రం ఐదుగురికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైజినాథ్‌ మూడో కుమార్తె భువనేశ్వరి(17) సోమవారం మరణించింది. చిన్ని కూతురు సంధ్య మంగళవారం కన్నుమూసింది. ఇందుమతి, మిగిలిన ఇద్దరు కుమార్తెల ఆరోగ్యం నిలకడగానే ఉంది. అక్కాచెల్లెళ్ల మృతిపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మామిడిపండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో... బాధిత కుటుంబం నివాసానికి వెళ్లిన జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు.. ఆ ఇంట్లోని ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ఆ నివేదికలతోపాటు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అక్కాచెల్లెళ్ల మరణంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 11 , 2026 | 05:06 AM