ఈదురుగాలులు మిగిల్చిన విషాదం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:28 AM
హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి రాత్రి తర్వాత బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు ఊహకందని విషాదాన్ని మిగిల్చాయి. గాలుల తీవ్రతకు తెగిన విద్యుత్ ...
తెగిన విద్యుత్‌తీగలు తగిలి షాక్‌తో తండ్రి, కుమార్తె మృతి
తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన భార్య
హైదరాబాద్ అల్వాల్‌లో ఘటన
హైదరాబాద్ సిటీ/అల్వాల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి రాత్రి తర్వాత బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు ఊహకందని విషాదాన్ని మిగిల్చాయి. గాలుల తీవ్రతకు తెగిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై తండ్రి, కుమార్తె తమ ఇంటి ముందే ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతానికి గురైన ఆ ఇంటి ఇల్లాలు కూడా తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. హైదరాబాద్‌లోని ఆల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధి టెలీకాం కాలనీలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అల్వాల్ ఎంఈఎస్ కాలనీకి చెందిన సందీప్(47), ఆయన భార్య శ్వేత, కుమార్తె రితిక(16) రెండేళ్లుగా టెలికాం కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సందీప్ బాలనగర్‌లోని సాయిశ్రీ ఫుడ్స్‌లో మేనేజర్ కాగా రితిక ఇటీవల ఇంటర్ ఫస్టియిర్ పూర్తి చేసింది. అయితే, శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో వీచిన ఈదురు గాలుల దెబ్బకు ఇంటి ముందున్న చెట్టు విరిగి తమ కారుపై పడుతుందనే భయంతో సందీప్, శ్వేత, రితిక బయటకు వచ్చారు. సందీప్ కారును పక్కన పెడుతుండగా మరోవైపు చెట్టుకొమ్మలు విరిగి మీద పడడంతో విద్యుత్ తీగలు తెగి కిందపడ్డాయి. ఆ తీగ తగలడంతో సందీప్ భార్య శ్వేత విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. భార్యను గమనించి ఆమెను కాపాడేందుకు సందీప్ కారులో నుంచి దిగారు. ఈ లోగా మరో విద్యుత్ తీగ తగిలి రితిక(16) విద్యుదాఘాతానికి గురైంది. కూతురుని కాపాడేందుకు పరుగెత్తిన సందీప్ కట్టె అనుకొని చేతికి దొరికిన మరో విద్యుత్‌తీగను పట్టుకోవడంతో ఆయన కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. సందీప్, రితిక అక్కడికక్కడే మరణించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ భర్త, కుమార్తెల మరణాన్ని చూసిన శ్వేత ప్రస్తుతం షాక్‌లో ఉంది. శ్వేతకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
నాలుగు రోజుల్లో రెండు ఘటనలు
వర్షాలు ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే హైదరాబాద్‌లో విద్యుదాఘాతానికి గురై నలుగురు మరణించారు. వర్షం, ఈదురుగాలుల దెబ్బకు తెగిపడిన విద్యుత్ తీగలు తగలి జూన్ 9న బండ్లగూడలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే అల్వాల్, టెలికాం కాలనీలో తండ్రీ, కుమార్తె మరణించారు.