Share News

వాహనాలు రయ్‌.. రయ్‌

ABN , Publish Date - May 10 , 2026 | 05:20 AM

‘‘హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్‌ కారిడార్‌ వంటి మూడు పద్ధతుల్లో సులభతర రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం.

వాహనాలు రయ్‌.. రయ్‌

  • ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌

  • అండర్‌ పాస్‌లు, రోడ్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు

  • భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా వసతులు

  • నగరాన్ని కాపాడడానికి మూసీ ప్రాజెక్టు

  • హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

  • పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భేటీలో సీఎం

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్‌ కారిడార్‌ వంటి మూడు పద్ధతుల్లో సులభతర రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం. ట్రాఫిక్‌ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. పార్కింగ్‌ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న నగరీకరణతో సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటికనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. సచివాలయంలో శనివారం గృహ నిర్మా ణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. హైదరాబాద్‌ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవనం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా స్టాండింగ్‌ కమిటీకి ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్‌, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ -2047 విజన్‌ డాక్యుమెంట్‌ను అందజేశారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని స్టాండింగ్‌ కమిటీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో సీఎం వివరించారు.


ఓఆర్‌ఆర్‌ పరిధిలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) మొత్తంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి క్యూర్‌, రేర్‌, ప్యూర్‌లుగా విభజించి ప్రణాళికలు రూపొందించాం. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ ప్రాంతాన్ని సర్వీస్‌ సెక్టార్‌గా, ఓఆర్‌ఆర్‌-రీజన ల్‌ రింగ్‌ రోడ్డు మధ్య పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ ప్రాంతాన్ని మాన్యుఫ్యాక్చర్‌ సెక్టార్‌గా, ఆర్‌ఆర్‌ఆర్‌ బయట ఉన్న రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశాం. తెలంగాణ రైజింగ్‌ 2047 మాస్టర్‌ ప్లాన్‌ లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని కమిటీకి రేవంత్‌ వివరించారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి, నగర సంస్కృతికి దానిని అనుసంధానించబోతున్నామని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ర్టిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, ఆర్టీసీలో ఎలక్ర్టిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. క్యూర్‌ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్‌ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో ఉన్నామని చెప్పారు.


మూసీ పునరుజ్జీవం విప్లవాత్మకం: కమిటీ

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టడం విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌తోపాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు మూసీ పునరుజ్జీవం తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ను కమిటీ అభినందించింది. రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. కాగా సమావేశం ప్రారంభంలో స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. సమావేశంలో స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డితోపాటు ఇతర సభ్యులు, సీఎస్‌ రామకృష్ణారావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 05:20 AM