Hyderabad Tops in Power Consumption: హైదరాబాద్ పవర్‌ఫుల్!
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:57 AM
హైదరాబాద్ మహానగరం విద్యుత్ వినియోగం, డిమాండ్‌లో రారాజు కానుంది. 2025-26, 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని అన్ని మహా నగరాలను దాటేయనుంది.
విద్యుత్ వినియోగంలో మహా నగరాల్లో టాప్
కేంద్ర విద్యుత్ సంస్థ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరం విద్యుత్ వినియోగం, డిమాండ్‌లో రారాజు కానుంది. 2025-26, 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని అన్ని మహా నగరాలను దాటేయనుంది. ఈ మేరకు 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా ఫలితాలను కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) వెలువరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ-150 డివిజన్లు) ఉన్న ప్రాంతం పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కలు వేశారు. దీని ప్రకారం బెంగళూర్, చెన్నయ్, కోల్‌కతా, ముంబైలను హైదరాబాద్ దాటేసింది. 2025-26లో ముంబై డిమాండ్ 4937 మెగావాట్లు కాగా... అదే హైదరాబాద్ డిమాండ్ 4667 మెగావాట్లు. ఇక 2026-27లో ముంబై డిమాండ్ 5153 మెగావాట్లు కాగా... హైదరాబాద్ డిమాండ్ 5154 మెగావాట్లు. ఇక 2027-28లో ముంబై డిమాండ్ 5396 మెగావాట్లు కాగా... హైదరాబాద్‌లో విద్యుత్ పీక్ లోడ్ 5682 మెగావాట్లుగా ఉంటుందని గుర్తు చేసింది. కాగా, 2025-26లో హైదరాబాద్ విద్యుత్ అవసరాలకు 28,419 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం ఉంటుందని లెక్కలు తీయగా... అదే ముంబైలో 27,693 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇక 2026-27లో హైదరాబాద్ విద్యుత్ అవసరాలకు 30,622 మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని, అదే ముంబైకి ఈ కాలంలో 28,857 మిలియన్ యూనిట్లుగా అంచనా వేశారు. ఇక 2027-28లో ముంబైకి 30,200 మిలియన్ యూనిట్లు, హైదరాబాద్‌కు 32,913 మిలియన్ యూనిట్లు కావాల్సి ఉంటుందని గుర్తుచేసింది. ఇక బెంగుళూర్, చెన్నై, కోల్‌కతాలు హైదరాబాద్‌కు దారిదాపుల్లో కూడా లేవు. ఇక విద్యుత్ వినియోగంలో కూడా హైదరాబాద్ టాప్‌గా ఉంది. 2025-26 లో హైదరాబాద్ 25,896 మిలియన్ యూనిట్లుగా ఉండనుందని తెలిపింది. మరోవైపు.. దేశంలో వివిధ కేటగిరీల విద్యుత్ వినియోగం భారీగా పెరగనుందని గణాంకాలు చెబుతున్నాయి.