వచ్చే నెల 19 నుంచి 22 వరకు ఐఆర్‌సీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:22 AM
వచ్చే నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ సదస్సును నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 85వ సదస్సు
దేశవిదేశాల 3 వేల మంది ప్రతినిధుల రాక
ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్,
కేంద్రమంత్రి గడ్కరీ: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ సదస్సును నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దేశవిదేశాల నుంచి 3 వేల మందికి పైగా ప్రతినిధులు రానున్నారని, 400 వరకు ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిఽథులుగా హాజరవుతారని.. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులూ సదస్సుకు రానున్నారని తెలిపారు. ఐఆర్‌సీ సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో అధికారులతో కోమటిరెడ్డి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్‌సీ సదస్సును అన్ని విభాగాల సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, రవాణా, ఆహార ఏర్పాట్లతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రింట్, ఎలకా్ట్రనిక్, డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, డిసెంబరులో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు ఆకర్షించేలా సదస్సు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులు ఒకే వేదికపై సమావేశం కానుండటంతో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో రెండోసారి ఐఆర్‌సీ సదస్సు నిర్వహణకు అవకాశం కల్పించిన కేంద్రమంత్రి గడ్కరీకి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కూడా ఆహ్వానించామని.. రాష్ట్రంలోని ఐఐటీ, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులనూ చర్చల్లో భాగస్వాములను చేయనున్నామని వెల్లడించారు.
కాగా, హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) రహదారిని 6+2 వరుసలతో విస్తరించేందుకు రూ.12,073 కోట్లతో ఇప్పటికే ఆమోదం లభించిందని.. త్వరలోనే ఈ రహదారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు సంబంధించి ఉత్తర భాగంలో 161.518 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని.. కేంద్ర క్యాబినెట్ నుంచి ఆమోదం రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన రహదారుల పనులు జరుగుతున్నాయని వివరించారు.