స్వచ్ఛత, శుభ్రత..
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:01 AM
హైదరాబాద్‌ను అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి..
హైదరాబాద్‌ను అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దుతాం
ఆంధ్రజ్యోతితో మెట్రోపాలిటన్ ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ ప్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ప్రత్యేకాధికారి జయేశ్‌రంజన్ తెలిపారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడు కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, సిబ్బంది పంపకాలను రెండు వారాల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. కోర్ అర్బన్ అభివృద్ధి లక్ష్యాలు, గ్లోబల్ సిటీగా తయారు చేయడానికి ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఆంధ్రజ్యోతి ముఖాముఖిలోపలు అంశాలను వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. జోన్లు, వార్డుల సరిహద్దులపై ఉన్న రాజకీయ అభ్యంతరాలు పాలనాపరమైన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందా?
వికేంద్రీకరణ అనేది మంచి పరిపాలనా పద్ధతి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అది సత్ఫలితాలిచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక పెద్ద జిల్లాలను చిన్నవిగా విభజించారు. కొంతకాలం క్రితమే ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాల విభజన జరిగింది. దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది. పరిపాలన కూడా మెరుగుపడింది. అదే రీతిలో ఇప్పుడు జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడాన్ని ప్రజలు అంగీకరిస్తారనే నమ్మకం ఉంది. కార్పొరేషన్ల సరిహద్దులు, పరిపాలనా అంశాలపై సమస్యలు రాకుండా ఉండేందుకు ఉద్యోగులు, ఆస్తుల విభజనపై రానున్న 15 రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటాం. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించి, వారికి శిక్షణ కూడా ఇస్తాం.
తెలంగాణ కోర్ అర్బన్ అభివృద్ధి లక్ష్యం ఏమిటి?
పౌరులకు ఇప్పుడు అందుతున్న వాటికంటే మెరుగైన సేవలు అందించాలనేది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీనికోసం ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లతో పాటు నూతనంగా ఏర్పాటైన రెండు కార్పొరేషన్ల కమిషనర్లతో చర్చిస్తున్నాం. రాజధానిని కాలుష్యరహిత, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాలి. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచి, ఒక అద్భుత నగరం అనే భావనను తీసుకురావాలి. హైదరాబాద్‌కు పారిశుద్ధ్య రంగంలో మంచి పేరుంది. కానీ, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలున్నాయి. అందుకోసం అధ్యయనం చేస్తున్నాం.
కోర్ అర్బన్ ప్రాంతాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
హైదరాబాద్ నగరం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతం. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఇలాంటి కోర్ అర్బన్ ప్రాంతాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనివల్ల చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. నూతన రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపడుతున్నాం. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై దృష్టిసారించి, హైదరాబాద్‌ను అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా, గ్లోబల్ సిటీగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
రానున్న 5-10 సంవత్సరాల్లో హైదరాబాద్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి?
కోర్ అర్బన్ పరిధిలో ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలన్నీ అమలైతే రానున్న 5-10 సంవత్సరాల్లో హైదరాబాద్ ప్రంపంచంలో సురక్షిత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుతాయి.సమస్యల పరిష్కారంలో వేగం పెరుగుతోంది.
కోర్ అర్బన్ ప్రాంతంలో పాలనా పరమైన నిర్ణయాలను వేగంగా అమలు చేసేందుకు బెంగళూరు తరహాలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తున్నారా?
ఇది మంచి సూచన. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. తదుపరి నిర్ణయం తీసుకుంటాం.
మూడు కార్పొరేషన్లకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 45 వేల మంది సిబ్బంది సరిపోతారా?
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సిబ్బందిని 3 కార్పొరేషన్లకు సర్దుబాటు చేస్తాం. ఆ తర్వాత ఆయా కార్పొరేషన్ల అవసరాల మేరకు కొత్త సిబ్బంది నియామకంకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.
విభజనపై టాస్క్‌ఫోర్స్
మూడు కార్పొరేషన్ల మధ్య ఆదాయం, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు జయేష్ రంజన్ తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో అనుభవమున్న ఉన్నతాధికారులు అధ్యయనం చేసి చేసే సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగినప్పుడు ఆర్థిక శాఖలోని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ విభాగంలో పనిచేసిన ఇద్దరు, ముగ్గురు అనుభవమున్న అధికారులతోపాటు ఇతర ఆఫీసర్లతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గురువారం నుంచే ఆస్తులు, అప్పుల విభజనపై కసరత్తు మొదలైందని చెప్పారు. పది రోజుల్లో టాస్క్‌ఫోర్స్ సిఫారసులు చేస్తుందని, వాటిని ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరో రెండుమూడు వారాలు పడుతుందని తెలిపారు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు వెంటనే 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.