హైదరాబాద్‌లో కేంబ్రిడ్జి విద్య
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:09 AM
ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్య.. ప్రపంచ ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజ్ స్వల్పకాలిక కోర్సులు.. మన రాజధాని హైదరాబా్‌లో అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు ముందుకుపడ్డాయి.
తెలంగాణ-కేంబ్రిడ్జి వర్సిటీల మధ్య ప్రత్యేక సహకార వ్యవస్థ
కేంబ్రిడ్జి వర్సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు
లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీ, క్రీడా రంగాల్లో భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
అక్టోబరులో రాష్ట్రానికి రానున్న లివర్‌పూల్ సిటీ అభివృద్ధి విభాగ బృందం
భాగ్యనగరంలో స్టడీ సెంటర్ ఏర్పాటుపై ‘ఇంపీరియల్’ ప్రతినిధుల హామీ
హైదరాబాద్, ఆగస్టు 22, (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్య.. ప్రపంచ ప్రఖ్యాత ఇంపీరియల్ కాలేజ్ స్వల్పకాలిక కోర్సులు.. మన రాజధాని హైదరాబా్‌లో అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు ముందుకుపడ్డాయి. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, పరిశోధన, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించడం, కొత్త స్టార్ట్‌పల అభివృద్థి వంటి అంశాల్లో.. తెలంగాణ ప్రభుత్వం, కే ంబ్రిడ్జి వర్సిటీ కలిసి పనిచేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక సహకార వ్యవస్థ ఏర్పాటుకానుంది. సీఎం రేవంత్‌రెడ్డి బ్రిటన్ పర్యటనలో భాగంగా శనివారం లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణ రైజింగ్ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట, ‘ఫ్రూగల్ ఏఐ’ కో-చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు సానుకూలంగా స్పందించారు. కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుందన్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ సిటీ డెవల్‌పమెంట్ విభాగం ఆసక్తి చూపింది.
ఆ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు.. ఈ మేరకు సీఎం రేవంత్‌ని లండన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహదారు రామకృష్ణారావు ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ విద్యా రంగంలో ఉన్న అవకాశాల గురించి వారికి వివరించారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో స్టడీ సెంటర్ ఏర్పాటు, షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని కాలేజీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు రావాలని ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులనురామకృష్ణారావు ఆహ్వానించారు.