క్రీడల్లో చైనాను అధిగమించాలి
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:31 AM
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ విలేజ్‌గా గచ్చిబౌలి క్రీడా సముదాయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడారంగం మౌలిక సదుపాయాల కల్పనలో చైనాను హైదరాబాద్ అధిగమించాలని ఆకాంక్షించారు.
దేశానికే హైదరాబాద్ ఆదర్శంగా నిలివాలి.. గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం
జూన్ 2న సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఒలింపిక్స్ స్థాయి సదుపాయాలతో ఆర్కిటెక్చర్
తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రముఖ కార్పొరేట్ సంస్థ సహకారంతో స్పోర్ట్స్ విలేజ్
రూ.700 కోట్లతో ప్రణాళిక!
స్టేడియానికి ఆ సంస్థ పేరు!
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ విలేజ్‌గా గచ్చిబౌలి క్రీడా సముదాయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. క్రీడారంగం మౌలిక సదుపాయాల కల్పనలో చైనాను హైదరాబాద్ అధిగమించాలని ఆకాంక్షించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. క్రీడారంగంలో దేశానికే ఆదర్శప్రాయంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనేది తన అభిమతమని, అందుకు తగ్గట్టుగా స్పోర్ట్స్ బోర్డు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ ఏడాది జూన్ 2న గచ్చిబౌలి క్రీడా సముదాయం సమగ్ర అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నామని, ఆలోపు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని బోర్డును ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి క్రీడాకారులు చేరుకునేలా హెలీప్యాడ్‌తో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సకల సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే గచ్చిబౌలి క్రీడాగ్రామం అభివృద్ధికి అవసరమైన ఆర్కిటెక్చర్ బ్లూ ప్లింట్ సిద్ధమైందని, దీనికి బోర్డు సభ్యుల ఆలోచనలు కూడా జోడించాలని సూచించారు. ఈ క్రీడాగ్రామం అభివృద్ధి, నిర్వహణకు భవిష్యత్తులో నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనేది తన దీర్ఘకాలిక లక్ష్యమన్నారు. సమావేశంలో తెలంగాణ స్పోర్ట్స్ బోర్డు సభ్యులు అపోలో లైప్ ఈడీ కొణిదెల ఉపాసన, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, పారిశ్రామికవేత్త చింత శశిధర్, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రూ.700 కోట్లతో అభివృద్ధి..!
గచ్చిబౌలి క్రీడా సముదాయం అభివృద్ధికి రూ.700 కోట్లతో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. భారత్‌కు చెందిన ఒకప్రముఖ కార్పొరేట్ సంస్థ సహకారంతో గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ రూపురేఖలను మార్చనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారని, క్రీడా సముదాయానికి మాత్రం ఆ సంస్థ పేరును పెట్టనున్నారని సమాచారం. ఒక చోట ఆ సంస్థ వ్యవస్థాపకుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ’ను గచ్చిబౌలి క్రీడా సముదాయంలో ఈ నెలఖారున ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. క్రీడా సముదాయంలోని స్పోర్ట్స్ టవర్‌లో 2, 3వ అంతస్తుల్లో తాత్కాలికంగా యూనివర్సిటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. పూర్తి స్థాయి కార్యకలాపాల నిర్వహణకు మరో రెండేళ్లు సమయం పట్టనుండగా, మొదటి దశలో తొమ్మిది నెలల వ్యవధితో కూడిన రెండు పీజీ సర్టిఫికెట్ కోర్సులను 25 నుంచి 35 మంది విద్యార్థులతో ప్రారంభించనున్నారు.