Share News

2.78 కోట్ల జనాభా.. 4 లక్షల కోట్ల పెట్టుబడులు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:43 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలో 2050 నాటికి 2.78 కోట్ల జనాభా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. హెచ్‌ఎండీఏకు.....

2.78 కోట్ల జనాభా.. 4 లక్షల కోట్ల పెట్టుబడులు!

  • హెచ్‌ఎండీఏ పరిధిలో 2050 నాటి అవసరాల మేరకు సమగ్ర రవాణా ప్రణాళిక

  • ప్రజా రవాణా 50 శాతానికి పెంపుదల

  • నగరంలో 556 కి.మీ. మేర మెట్రో రైలు విస్తరణ

  • ఎంఎంటీఎస్‌ 336 కిలోమీటర్లకు, రోడ్డు నెట్‌వర్క్‌ 19,352 కిలోమీటర్లకు పెంచేందుకు ప్లాన్‌

  • 120 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు/స్కైవాక్‌లు, 8 ఎలివేటెడ్‌ కారిడార్లు, మూసీపై 29 బ్రిడ్జిల నిర్మాణానికి సూచన

  • 19 మల్టీలెవల్‌ పార్కింగ్‌ సదుపాయాలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలో 2050 నాటికి 2.78 కోట్ల జనాభా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. హెచ్‌ఎండీఏకు మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో భాగంగా సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపీ)ను ఓ కన్సల్టెన్సీ ద్వారా సిద్ధం చేశారు. దాదాపు ఏడాది పాటు కసరత్తు చేయగా అది తుది రూపునకు చేరింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 2050 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు సీఎంపీలో కీలక ప్రతిపాదనలను సూచించారు. మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడంతో ఎంఎంటీఎస్‌, రోడ్ల వెడల్పు, ప్రత్యేక బస్‌ లేన్ల ఏర్పాటుతో పాటు ఇతర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి కసరత్తు చేశారు. ప్రస్తుతమున్న నగర జనాభా, ప్రజా రవాణాను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించారు. ఈ సీఎంపీ ప్రతిపాదనలను అమలు చేయడానికి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్యాసింజర్‌ రైడర్‌షిప్‌ (ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించే వారి సంఖ్య)తో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులను, భవిష్యత్తు అవసరాల అనుగుణంగా రోడ్ల విస్తరణ తదితరాలపై అధ్యయనం చేసి సీఎంపీ ముసాయిదా నివేదికను సిద్ధం చేశారు. 14 ఏళ్ల క్రితం అప్పటి హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031 కోసం 2011లో చేసిన ప్రజా రవాణా వ్యవస్థ, ఇతర వాహనాల వినియోగ సర్వే వివరాలతో పోల్చారు. అయితే 14 ఏళ్ల క్రితంతో పోల్చితే బస్సులను ఎక్కే వారి సంఖ్య పడిపోవడం గమనార్హం. 2011లో బస్సులను వినియోగించే వారి సంఖ్య 42 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 35 శాతానికి పడిపోయింది. మున్ముందు ఇది మరింత పడిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు.


ప్రజా రవాణాను 50 శాతానికి పెంచేలా..

హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రస్తుతం 1.39 కోట్ల జనాభా ఉండగా.. అందులో ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్న వారు 55.74 లక్షల వరకు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ప్రజా రవాణాను 24 శాతమే వినియోగించుకుంటున్నారు. 12 శాతమే ఆటోలు, క్యాబ్‌లను వాడుతుండగా.. 64 శాతం ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. 2050 నాటికి జనాభా 2.78 కోట్లకు పెరుగుతుండడంతో అందులో ఉద్యోగాలు, ఉపాధి పొందే వారు 1.41 కోట్లకు చేరనున్నారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణాను 50 శాతం పెంచాలని.. ఆటోలు, క్యాబ్‌ల వినియోగం 17 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో నెట్‌వర్క్‌ను 556.6 కిలోమీటర్లకు పెంచాలని.. ప్రతి దిశకు ఒక ట్రాక్‌ ఉండే ట్విన్‌ ట్రాక్‌ వ్యవస్థను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక ఎంఎంటీఎ్‌సను 336 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా బస్సు లేన్లను 48 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయాలని.. రోడ్డు నెట్‌వర్క్‌ను మొత్తం 19,352 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

75 జంక్షన్లు, మూసీపై 29 వంతెనలు!

2050 భవిష్యత్తు అవసరాల అనుగుణంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 75 జంక్షన్లను అభివృద్ధి చేయాలని సీఎంపీలో ప్రతిపాదించారు. వివిధ ప్రాంతాల్లో 120 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు/స్కైవాక్‌లు, 34 రైల్వే ఓవర్‌ బ్రిడ్జీలు, 16 రైల్వే అండర్‌ పాస్‌లను, 8 ఎలివేటెడ్‌ కారిడార్‌ రోడ్లను నిర్మించాలని సూచించారు. మూసీ నదిపై 29 వంతెనలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో 7 ఇంటర్‌సిటీ/ఇంటర్‌స్టేట్‌ బస్‌ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, వీధుల్లో పార్కింగ్‌ను నివారించేందుకు 19 మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సీఎంపీలో పేర్కొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 04:43 AM