1.3 కిలోమీటర్ల అండర్‌పాస్
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:47 AM
హైదరాబాద్ నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు (మేడ్చల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి....
హైదరాబాద్ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకు (మేడ్చల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ వరకు (6లేన్లు 5.34కిలోమీటర్లు), అలాగే సికింద్రాబాద్ సీబీఐ కాలనీ నుంచి శామీర్‌పేట్ వరకు (ఓఆర్‌ఆర్ వరకు 6 లేన్లు, 18.14 కిలోమీటర్లు) ఈ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ మార్గాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూముల బదలాయింపు, అడ్డంకుల తొలగింపు, ప్రహరీల నిర్మాణ పనులకు అనుమతులు లభించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రక్షణ శాఖ భూములతోపాటు ప్రైవేటు ఆస్తులు, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అనుకున్నట్టుగా పనులు చకా, చకా సాగిపోతే రెండేళ్లలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. దాంతో ట్రాఫిక్ చిక్కుల్లేకుండా వాహనదారులు మహానగరం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు.
అండర్‌పాస్‌తో సాఫీ ప్రయాణం..
మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ కారిడార్ కోసం 1.3 కిలోమీటర్ల మేర అండర్‌పాస్ (భూగర్భ మార్గం) నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద అండర్‌పాస్‌గా నిలువనుంది. కరీంనగర్ వైపు మార్గంలో వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని దీనికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక రూపొందించింది. సికింద్రాబాద్‌లోని ఖార్కానాకు సమీపంలో గల విక్రంపురి ఏఓసీ మెయిన్ రోడ్డు కంటే ముందు ఎలివేటేడ్ స్టీల్ కారిడార్ ప్రారంభమవ్వనుంది. దీనికోసం ఉద్దేశించిన ఈ అండర్‌పాస్ సికింద్రాబాద్‌లోని జింఖానా, పరేడ్ గ్రౌండ్ మధ్య గల రోడ్డు నుంచి ప్రారంభమవుతుంది. టీవోలీ జంక్షన్, ఆ తర్వాత జనరల్ చౌదరి, స్టాఫ్ రోడ్డు జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్ ముందున్న జంక్షన్‌ను సిగ్నల్ రహితంగా మారుస్తూ నిర్మించనున్నారు. 25మీటర్ల వెడల్పుతో, ఆరు లేన్లతో నిర్మించనున్న అండర్‌పాస్‌తో మూడు జంక్షన్లు సిగ్నల్ ఫ్రీగా మారనున్నాయి. అండర్‌పాస్ నుంచి రెండు వైపులా వాహనాలు ఎక్కడా ఆగకుండా సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ అండర్‌పాస్‌కు ఇరువైపులా ఎత్తైన గోడను నిర్మించనున్నారు. ఇరువైపులా సర్వీసు రోడ్డు కూడా రానుంది. నిజానికి ప్యారడైజ్ నుంచే ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావించగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభ్యంతరాలతో.. కారిడార్ ముందుకు వెళ్లి, ప్యారడైజ్ నుంచి అండర్‌పాస్‌కు ప్రణాళిక రచించారు. 1.3కిలోమీటర్ల ఉండే అండర్‌పాస్‌ను భూమిలోపల దాదాపు 5.3మీటర్ల లోతుతో నిర్మించనున్నారు. వర్షంపునీరు వెళ్లేందుకు ఇరువైపుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించనున్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని భారీ సంపునకు అనుసంధానం చేయనున్నారు. వర్షం వచ్చిన సందర్భంలో సంపులోకి చేరిన నీటిని బయటకు ఎత్తిపోసేందుకు రెండు భారీ మోటర్లను అమర్చనున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో గల వార్ మెమోరియల్‌ను తరలించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌లోనే మరో ప్రాంతంలో చెక్కు చెదరకుండా నిర్మించనున్నారు. ఇందుకు డిఫెన్స్ అధికారులు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ వార్ మెమోరియల్‌ను మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు.