బొగ్గు వాయువీకరణకు హైదరాబాదే మూలాధారం!
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:41 AM
బొగ్గు వాయువీకరణ (కోల్ గ్యాసిఫికేషన్ ) ప్రయాణానికి హైదరాబాద్ ఒక మూలాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గ్యాసిఫికేషన్ స్కీంతో 3లక్షల కోట్ల పెట్టుబడులు
ఈ ఉత్పత్తులకు హైదరాబాద్ అద్భుత మార్కెట్
కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): బొగ్గు వాయువీకరణ (కోల్ గ్యాసిఫికేషన్ ) ప్రయాణానికి హైదరాబాద్ ఒక మూలాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైటెక్స్‌లోని నోవాటెల్‌లో గురువారం రెండో కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రోడ్ షో కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందనే పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు. మే 28న ఢిల్లీలో నిర్వహించిన తొలి రోడ్ షోకు పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశోధకులు, ప్రాజెక్టు అభివృద్ధి సంస్థల నుంచి విశేష స్పందన లభించిందని, రెండవ షో హైదరాబాద్‌లో నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఒకప్పుడు మన దేశంలోని బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేదన్నారు. కానీ హైదరాబాద్‌లోని మన శాస్త్రవేత్తలు ఇక్కడ లభ్యమయ్యే బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులకు హైదరాబాద్ అద్భుతమైన మార్కెట్ అని, కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశమని ఆయన అభివర్ణించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఫర్టిలైజర్లు, కెమికల్స్, హైడ్రోజన్, శుద్ధమైన ఇంధనం ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్ వంటివాటి ఉత్పత్తిలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రూ.3 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని దిగుమతుల కోసమే వినియోగిస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ నేడు కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ‘దేశంలోని 72శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోంది. కానీ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించి, తద్వార మిగిలిన బొగ్గును గ్యాసిఫికేషన్ వైపు మళ్లించాలన్నదే మోదీ సర్కారు ధ్యేయం. కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు దాదాపు రూ.46,000 కోట్ల భారీ పథకాన్ని కేంద్రం ప్రకటించింది.’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.