హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా మార్చాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:40 AM
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలి
ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి
కొత్త డంప్ యార్డులను అందుబాటులోకి తీసుకురండి
మునిసిపల్ కమిషనర్లతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ప్రతి రోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఎలక్ర్టిక్ వాహనాలను వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనాన్ని ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మునిసిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా దగ్గర్లోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ వ్యర్థాలు కూడా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతోపాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల విషయంలో నగర వాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రెటరీ మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబద్ మునిసిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మునిసిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.