తలసీమియా బాధితులకు అండగా నిలుద్దాం
ABN , Publish Date - May 11 , 2026 | 06:22 AM
చిన్నారులు ఆడుకునే వయస్సులోనే ప్రతి 15 రోజులకోసారి బాధాకరమైన తలసీమియా చికిత్స తీసుకోవాల్సి రావడం కలచివేస్తోందని, వారికి సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని...
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి: నారా భువనేశ్వరి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా తలసీమియా రన్
ఖైరతాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు ఆడుకునే వయస్సులోనే ప్రతి 15 రోజులకోసారి బాధాకరమైన తలసీమియా చికిత్స తీసుకోవాల్సి రావడం కలచివేస్తోందని, వారికి సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రపంచ తలసీమియా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జలవిహార్ నుంచి మూడు విభాగాల్లో (3కె, 5కె, 10కె) నిర్వహించిన తలసీమియా రన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నారా భువనేశ్వరి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ రన్‌లో భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్లా, సినీనటి మానస తదితరులు పాల్గొని యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, తలసీమియా వ్యాధి పట్ల సరైన అవగాహన లేక ప్రతిఏటా వేలాది మంది చిన్నారులు వ్యాధిగ్రస్తులుగా జన్మనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 1.5 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7,500 మంది బాధితులు ఉన్నారని, వీరికి రక్తదానమే ప్రాణాధారమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి, ఈ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. పరుగులో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా మెడల్స్ అందజేసి అభినందించారు.