మోసపూరితంగా టీచర్ కొలువు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:20 AM
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సంపాదించాలనుకున్న వ్యక్తి.. స్థానికత కోసం సమర్పించిన ధ్రువ పత్రాలు నకిలీవని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచీ పోలీసులు గుర్తించారు.
ఉద్యోగం నుంచి తొలగించిన హైదరాబాద్ డీఈవో
ఉద్యోగ దరఖాస్తుల్లో వేర్వేరు బోనఫైడ్లు
గుర్తించిన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సంపాదించాలనుకున్న వ్యక్తి.. స్థానికత కోసం సమర్పించిన ధ్రువ పత్రాలు నకిలీవని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచీ పోలీసులు గుర్తించారు. దీంతో 2024-డీఎస్సీ ద్వారా అసి్‌ఫనగర్ మండలం గులాబ్‌సింగ్ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీగా చేరిన రాజేశ్ అనే ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించినట్లు హైదరాబాద్ డీఈఓ రోహిణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజేశ్ తన డీఎస్సీ దరఖాస్తులో జియాగూడ-సబ్జీమండిలోని గీతాంజలి ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 1996-2006 మధ్య 1-8వ తరగతి వరకూ చదివినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ సమర్పించారు. గ్రూప్-4 ఉద్యోగం కోసం సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తులో నవ విద్యాస్కూల్‌లో 1,2 తరగతులు చదివినట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామక ఇంటర్వ్యూల సమయంలోనూ గీతాంజలి పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్‌నే అధికారులకు చూపి ఉద్యోగం సంపాదించాడు. అయితే, డీఎస్సీ-2024 ద్వారా టీచర్ కొలువులు సంపాదించిన అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను హైదరాబాద్ నగర పోలీసుల స్పెషల్ బ్రాంచ్ విచారిస్తుండగా రాజేశ్ వ్యవహారం బయట పడింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసగించినందుకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం రాజేశ్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో డీఈఓ రోహిణి వెల్లడించారు. 2024-డీఎస్సీలో హైదరాబాద్ జిల్లాలో 285 ఎస్టీజీలతోపాటు 878 మంది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, హైదరాబాద్‌లో మూత పడ్డ పాఠశాలల నుంచి టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి 32 మంది అభ్యర్థులు విధుల్లో చేరినట్లు 2024 అక్టోబరు- డీఎస్సీ కౌన్సిలింగ్ తర్వాత ఆరోపణలొచ్చాయి. వారిలో 12 మంది సర్టిఫికెట్లు నకిలీవని హైదరాబాద్ నగర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిగ్గు తేల్చారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తూ.. ఇతర జిల్లాల్లో డీఈడీ, బీఈడీ పూర్తి చేశారని ఫిర్యాదులొచ్చిన అభ్యర్థులను పక్కన బెట్టారు.