రద్దీ ఉంటే రిజిస్ట్రేషన్లకు అదనపు పని వేళలు
ABN , Publish Date - May 10 , 2026 | 05:22 AM
కోర్ అర్బన్ పరిధిలో అత్యధిక రద్దీ ఉండే 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి పని వేళలను పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణ యం తీసుకుంది.
12 నుంచి ‘కోర్ అర్బన్’లోని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏర్పాట్లు
రిజిస్ట్రేషన్ల శాఖ అధికార్ల నిర్ణయం
అవసరమైతే మరింత సమయాన్ని పెంచుతాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మే 9 (ఆంధ్ర జ్యోతి): కోర్ అర్బన్ పరిధిలో అత్యధిక రద్దీ ఉండే 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి పని వేళలను పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణ యం తీసుకుంది. ఈ కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. భూముల కొత్త మార్కెట్ విలువలను ఈనెల 26 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు రద్దీ వల్ల ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్లగొండ, పటాన్‌చెరువు, కుత్బుల్లాపూర్ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరింత సమయం పెంచుతామని చెప్పారు. అలాగే, కోర్ అర్బన్‌తో పాటు ఓఆర్‌ఆర్ అవతల, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగే కార్యాలయాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతును మంత్రి ఆదేశించారు.