మందులతో సరిపోదు.. మన తీరు మారాల్సిందే
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:24 AM
అధిక రక్తపోటు సమస్యకు మందులు వేసుకున్నంతమాత్రాన చాలదని.. జీవనశైలి లోపాలను కూడా మార్చుకోవాలని, లేదంటే గుండె జబ్బులు....
ఉప్పు వాడకం ఎక్కువ, శారీరక శ్రమ తక్కువ.. జీవనశైలి లోపాలు
ఫలితంగా బీపీ గోలీ వేసుకుంటున్నా పెరుగుతున్న హృద్రోగాల ముప్పు
హైదరాబాద్ పరిధిలో అధిక రక్తపోటు రోగులపై అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): అధిక రక్తపోటు సమస్యకు మందులు వేసుకున్నంతమాత్రాన చాలదని.. జీవనశైలి లోపాలను కూడా మార్చుకోవాలని, లేదంటే గుండె జబ్బులు, పక్షవాతం (స్ట్రోక్), మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (కమ్యూనిటీ మెడిసిన్ విభాగం) చెందిన డాక్టర్ బెత్తి అఖిల్, డాక్టర్ మెహబూబీ షేక్, డాక్టర్ షబ్నం అంజుమ్, డాక్టర్ హఫ్సా జబీన్ బృందం.. నగర పరిధిలోని 330 మంది బీపీ రోగులపై ఒక ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశోధన (కమ్యూనిటీ బేస్డ్ క్రాస్-సెక్షనల్ స్టడీ) నిర్వహించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మహిళల్లో 24.2 శాతం, పురుషుల్లో 28.2 శాతం రక్తపోటుతో బాధపడుతున్నారు. వీరిలో కొంతమంది క్రమం తప్పకుండా బీపీ ఔషధాలు వాడుతుంటే.. మరికొందరు కొన్నిరోజులు వాడి పక్కనపెట్టేస్తున్నట్టు ఈ అధ్యయనంలో తెలిసింది. రక్తపోటు నియంత్రణలో ఉందిలే అన్న ధీమా వారిని మందులకు దూరం చేస్తోందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. అలాగే.. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 69.1శాతం మంది క్రమం తప్పకుండా బీపీ మందులు వాడుతున్నప్పటికీ వారిలో 17.6శాతం మంది బీపీ సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. దీనికి కారణం జీవనశైలి లోపాలేనని వైద్యులు స్పష్టం చేశారు. మొదట్నుంచీ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించే వారికి బీపీ సంబంధిత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. పోషకాహారం తీసుకునే వారిలో 8.9శాతం మంది మా త్రమే సమస్యల బారిన పడగా, జంక్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో ఈ ముప్పు 27.1 శాతంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైందన్నారు. ‘డాష్’ డైట్ వంటి పద్ధతులు పాటించడం వల్ల సోడియం తగ్గి, పొటాషియం, మెగ్నీషియం పెరిగి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ‘పట్టణ ప్రాంతాల్లో బీపీ రోగులకు మందులు అందుబాటులో ఉంటున్నాయి, వారు వాడుతున్నారు కూడా. కానీ, కేవలం మందులే సర్వరోగ నివారిణి కావు. నగరాల్లో 90శాతం మంది కూర్చుని చేేస ఉద్యోగాల వల్లే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. ఆహారంలో ఉప్పు తగ్గించడం, రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం, బరువు నియంత్రణ, డిజిటల్ రిమైండర్ల సాయంతో మందులు మరచిపోకుండా వేసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారానే ఈ ‘హైపర్’ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని దక్కన్ మెడికల్ కాలేజీ పరిశోధన బృందం వెల్లడించింది. అధ్యయనంలో వెల్లడైన మరికొన్ని ముఖ్యాంశాలు..
బీపీ తీవ్రత వల్ల తలెత్తిన సమస్యల్లో గుండె జబ్బులు (3.9శాతం) తొలిస్థానంలో ఉండగా, కిడ్నీ వ్యాధులు (2.4శాతం), నరాల బలహీనత/న్యూరోపతి(2.4శాతం), పక్షవాతం/స్ట్రోక్(1.8శాతం), కంటిచూపు దెబ్బతినడం/రెటినోపతి (1.5శాతం) వంటి సమస్యలు తర్వాతిస్థానాల్లో ఉన్నాయి.
మందులు సరిగ్గా వాడకపోవడానికి ప్రధాన కారణం.. మరచిపోవడం (56.9శాతం) అని తేలింది. చికిత్సపై అవగాహన లేకపోవడం వల్ల 29.4శాతం మంది, మందుల ఖర్చు భరించలేక 13.7శాతం మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.
బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది (70.7శాతం) ఉప్పు అధికంగా తింటున్నారని.. 74.1శాతం మంది ఏ శారీరక శ్రమా చేయ డం లేదని వెల్లడైంది. ఇదే అసలైన ప్రమాదమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.