Share News

ఫూలే దంపతులు, సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహాల ఆవిష్కరణకు తేదీలు ఖరారు

ABN , Publish Date - Aug 09 , 2026 | 06:00 AM

హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ పక్కన ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావుఫూలే, సావిత్రీబాయిఫూలే విగ్రహాలు ఈనెల 14న, ట్యాంక్‌బండ్‌పై..

ఫూలే దంపతులు, సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహాల ఆవిష్కరణకు తేదీలు ఖరారు

  • బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల భేటీలో నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ పక్కన ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావుఫూలే, సావిత్రీబాయిఫూలే విగ్రహాలు ఈనెల 14న, ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని 18న ఆవిష్కరించాలని బీసీ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఈమేరకు శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సమావేశమై చర్చించారు. విగ్రహావిష్కరణల కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కులసంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ శాఽఖ ద్వారా అమలవుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ మరింత సమర్థంగా అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆత్మగౌరవ భవనాలకు త్వరగా నిధులు కేటాయించి నిర్మాణాలను పూర్తిచేయడంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీనియర్‌ నేత వి.హనుమంతరావు, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, నవీన్‌ యాదవ్‌, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 06:01 AM