Share News

రోదసిలో మన ఏఐ డేటా సెంటర్‌!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:29 AM

భారీ తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు ఊళ్లకు ఊళ్లే దెబ్బతింటాయి. అలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఉపగ్రహాలు కక్ష్యలో నుంచి తీసి, పంపిన ఛాయాచిత్రాలే మనకు ఉపయోగపడతాయి.

రోదసిలో మన ఏఐ డేటా సెంటర్‌!
space

space2 copy.jpg

  • 1న స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ఎంవోఐ-1ఏ ఉపగ్రహాన్ని

  • రోదసిలోకి పంపనున్న హైదరాబాద్‌ టెక్‌ స్టార్టప్‌ ‘టేక్‌మీ2స్పేస్‌’

  • ఈ ఏడాదిలోనే మరో ఉపగ్రహాన్ని ఇస్రో ద్వారా పంపే ప్రణాళిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 28: భారీ తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు ఊళ్లకు ఊళ్లే దెబ్బతింటాయి. అలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఉపగ్రహాలు కక్ష్యలో నుంచి తీసి, పంపిన ఛాయాచిత్రాలే మనకు ఉపయోగపడతాయి. అయితే.. ఉపగ్రహాలు తీసిన ఫొటోలను భూమికి పంపితే, ఇక్కడున్న శాస్త్రజ్ఞులు కంప్యూటర్ల ద్వారా వాటిని విశ్లేషించి ఆ వివరాలను తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా.. రోదసిలోనే డేటా సెంటర్లను ఏర్పాటుచేసి, ఉపగ్రహాలు తీసిన ఛాయాచిత్రాలను ఆ డేటాసెంటర్‌లోనే విశ్లేషించి.. మనకు కావాల్సిన సమాచారాన్ని అవి వేగంగా పంపేలా చేయగలిగితే? ఆలోచన అద్భుతంగా ఉంది కదూ! హైదరాబాద్‌కు చెందిన ‘టేక్‌మీ2స్పేస్‌’ స్టార్టప్‌ సంస్థ దీన్ని సాకారం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రెండు ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకుఆ సంస్థ ప్రణాళికలు రచించింది. వాటిలో మొదటి శాటిలైట్‌ ‘ఎంవోఐ-1ఏ’ను అక్టోబరు 1న.. ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ చేపట్టిన ట్రాన్స్‌పోర్టర్‌-18 రైడ్‌షేర్‌ మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఇలాంటి శాటిలైట్లు.. ముందుగానే వాటిలో పొందుపరిచిన ప్రోగ్రామ్‌ల ఆధారంగా ఒక స్థిరమైన పనిని మాత్రమే చేస్తాయి. కానీ.. మన ఫోన్‌లో రకరకాల యాప్‌లు వేసి రకరకాల పనులు చేయించుకున్నట్టే, ఈ శాటిలైట్‌కు భూమ్మీది నుంచే మనకు కావాల్సిన అల్గారిథమ్‌లను పంపి కావాల్సిన పని మాత్రమే చేయించుకోవచ్చు.


ఉదాహరణకు.. ఎక్కడైనా వరదలు వస్తే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భూమ్మీది నుంచే దీనికి నీటి ముంపు ప్రాంతాలను గుర్తించే ఒక అల్గారిథమ్‌ను పంపి వరదల తాలూకూ డేటాను తీసుకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు.. పంటలు ఎండినా, తెగుళ్లబారిన పడినా తెలుసుకునే అల్గారిథమ్‌ను పంపి.. ఏయే ప్రాంతాల్లో ఎంత పంట ఎండిపోయింది? ఎంత పంట తెగుళ్లబారిన పడింది? అనే వివరాలు తెలుసుకోవచ్చు. నౌకాదళ అధికారులు.. మన తీరానికి దగ్గరగా ఏవైనా అనుమానాస్పద ఓడలు, పడవలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే అల్గారిథమ్‌ను అప్‌లోడ్‌ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈ ఉపగ్రహంలో ఆర్బిట్‌ ల్యాబ్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను పొందుపరిచారు. నిజానికి ఈ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జనవరిలో ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్‌వీ సీ62 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ, మూడో దశలో తలెత్తిన సాంకేతిక లోపంతో ఆ ప్రయోగం విఫలమైంది. రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోలేకపోయింది.

మరో ఉపగ్రహం..

ఎంవోఐ-1ఏ తర్వాత.. ‘ఎంవోఐ-1బి’ అనే మరో శాటిలైట్‌ను ఇదే ఏడాది ఇస్రో చేపట్టే మిషన్‌లో భాగంగా కక్ష్యలోకి పంపనుంది. అయితే.. ఈ రెండు శాటిలైట్లూ ‘టేక్‌మీ2స్పేస్‌’ సంస్థ 2028లో చేపట్టే భారీ ప్రయోగానికి ట్రైలర్లలాంటివి మాత్రమే. వీటిలో అమర్చే చిప్‌లు రోదసిలో ఉండే తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయి? అనే విషయాన్ని తెలుసుకోవడం ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఈ ఉపగ్రహాలు విజయవంతంగా పనిచేస్తే.. 2028లో ఒక్కొక్కటీ 100 కిలోల బరువుండే రెండు శాటిలైట్లను రోదసిలోకి పంపేందుకు ‘టేక్‌మీ2స్పేస్‌’ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఆ రెండు ఉపగ్రహాలూ ఒకదానికొకటి లేజర్‌ కిరణాలతో అనుసంధానమై పూర్తిస్థాయి క్లౌడ్‌ డేటా సెంటర్‌లాగా పనిచేస్తాయి. ఎంవోఐ-1ఏ ఉపగ్రహంలో ఒక్క ఎన్‌విడియా చిప్‌ ఉంటే.. 2028లో పంపే 100 కిలోల ఉపగ్రహంలో ఏకంగా 10 ఎన్‌విడియా థోర్‌ చిప్‌లుంటాయి. ఆ ఉపగ్రహాలు పూర్తిస్థాయిలో పనిచేసేటప్పుడు గరిష్ఠంగా 1500వాట్ల విద్యుత్తును వినియోగిస్తాయి.


గూగుల్‌ తరహాలోనేగానీ..

రోదసిలో ఏఐ డేటాసెంటర్ల ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ కూడా ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’ పేరుతో ఒక భారీ మిషన్‌ను చేపట్టింది. కానీ.. అది చాలా భారీ ప్రాజెక్టు. టేక్‌మీ2స్పేస్‌ పంపే శాటిలైట్లు అవి తీసిన ఫొటోలనే విశ్లేషించి, డేటాను కిందికి పంపిస్తాయి. కానీ.. గూగుల్‌ సంస్థ భూమ్మీద ఉన్న తరహాలోనే భారీ ఏఐ క్లౌడ్‌ డేటా సెంటర్లను రోదసిలో ఏర్పాటు చేయాలనుకుంటోంది. భూమ్మీద నుంచి పంపే డేటాను కూడా అవి విశ్లేషిస్తాయి. అక్టోబరు 1న ఫాల్కన్‌ 9 రాకెట్‌ మోసుకెళ్లే ఉపగ్రహాల్లో ఎంవోఐ-1ఏతోపాటు గూగుల్‌ ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’లో భాగంగా పంపిస్తున్న ప్రోటోటైప్‌ శాటిలైట్‌ ఉండడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

Updated Date - Sep 29 , 2026 | 03:32 AM