Share News

ఇంటింటికీ వెళ్లని బీఎల్‌వోలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:00 AM

ఎస్‌ఐఆర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) డ్రైవ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గందరగోళంగా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటింటికీ వెళ్లని బీఎల్‌వోలు

  • ఎస్‌ఐఆర్‌ ఫారాల పంపిణీ అసంపూర్ణం

  • కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, కాలనీలలో క్యాంపులు పెట్టి కొంతమందికే అందజేత

  • 99 శాతం పూర్తయ్యిందంటున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి

  • ఫారాలు అందుకున్న వారు తక్కువ మందే.. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన సర్వేలో వెల్లడి

  • బకాయిలు చెల్లించాలంటూ కంటోన్మెంట్‌లో బీఎల్‌వోల విధుల బహిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) డ్రైవ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గందరగోళంగా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించి, నమోదు పత్రాలు పంపిణీ చేయాల్సిన బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వోలు) క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బీఎల్‌వోలు రోజూ 50 ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వాలి. కానీ, వారు ఆ లక్ష్యాన్ని పూర్తి చేయకలేకపోతున్నారు. కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, కాలనీల్లో కొన్ని చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసి పత్రాలను అక్కడికి వచ్చే ఓటర్లకు ఇస్తున్నారే తప్ప, చాలా చోట్ల ఇంటింటికీ వెళ్లట్లేదు. కానీ అధికారులు మాత్రం నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ 65 నుంచి 99 శాతం దాకా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ‘ఆంధ్రజ్యోతి’ జరిపిన సర్వేలో.. మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది మాత్రమే తమకు ఫారాలు అందాయని చెప్పగా.. 56శాతం మంది తమకు బీఎల్‌వోలు ఫారాలు ఇవ్వలేదని చెప్పారు. ఇలా పంపిణీ ప్రక్రియ వాస్తవంగా ఎంతవరకు పూర్తయిందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ ఉద్యోగులు అధికంగా నివసించే ప్రాంతాల్లో చాలామందికి ఇంకా ఫారాలు అందలేదని స్థానికులు చెబుతున్నారు.


ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే నియోజకవర్గాలవారీగా రోజువారీ పురోగతి, పంపిణీ శాతం, మిగిలిన ఇళ్ల సంఖ్య వంటి వివరాలను బహిరంగంగా ప్రకటించాలని సూచిస్తున్నారు. కాగా, ఐదేళ్లుగా తమతో పని చేయించుకుంటూ జీతాలు చెల్లిండం లేదని.. పెండింగ్‌లో ఉన్న తమ పారితోషికాలు, బకాయిలను చెల్లించే వరకూ విధులకు హాజరుకాబోమని పేర్కొంటూ 231 మంది బీఎల్‌వోలు కంటోన్మెంట్‌ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ సవరణ కార్యక్రమం ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఓటు ఉంటుందా? ఉండదా? అనే సందేహం ఓటర్లలో వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 09 , 2026 | 05:02 AM