Share News

Cold wave: రోజంతా గజ గజ

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:40 AM

చలి గాలులతో హైదరాబాద్‌ నగర వాసులు గజగజలాడుతున్నారు. నాలుగు రోజులుగా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చలి గాలులు వీస్తుండడంతో....

Cold wave: రోజంతా గజ గజ

  • వణుకుతున్న హైదరాబాద్‌ నగర వాసులు

  • శేరిలింగంపల్లిలో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలు

  • ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 6 డిగ్రీలు

హైదరాబాద్‌ సిటీ/కోహీర్‌/ఆసిఫాబాద్‌/సిరిసిల్ల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : చలి గాలులతో హైదరాబాద్‌ నగర వాసులు గజగజలాడుతున్నారు. నాలుగు రోజులుగా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చలి గాలులు వీస్తుండడంతో వయోధికులు, పిల్లలు వణికిపోతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 7.4, రాజేంద్రనగర్‌లో 8, మల్కాజిగిరిలో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో సాధారణంకంటే 2-4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరం మధ్యలో 10-12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా శివారు ప్రాంతాల్లో 7-9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశముంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో శుక్రవారం ఉదయం 5.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యల్పం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నాలుగు రోజులుగా సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని 16 ప్రాంతాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలు, అల్గోల్‌ 6.2, న్యాల్‌కల్‌ 6.6, సత్వార్‌ 8.7, కంగ్టి 9, రాయికోడ్‌ 9.4, నిజాంపేట్‌ 9.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లాలో అంగడికిష్టాపూర్‌ 9.2, కొండపాక 9.5, మెదక్‌ జిల్లాలోని దామరంచ 9.4, శంకరంపేట్‌ 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో శుక్రవారం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌(యు)లో 6.5, కెరమెరిలో 9, వాంకిడిలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jan 10 , 2026 | 04:40 AM