Share News

ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:46 AM

రవాణా రంగంలో హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రం (ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్నోవేషన్‌ హబ్‌)గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు..

ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా హైదరాబాద్‌

  • ఈ ఏడాది చివరికి ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్ను మాఫీ: రవాణా మంత్రి పొన్నం

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రవాణా రంగంలో హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రం (ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్నోవేషన్‌ హబ్‌)గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌- హెచ్‌ఐసీసీలో ద్వితీయ జాతీయ మొబిలిటీ సమ్మిట్‌-2026ను ఆయన ప్రారంభిస్తూ.. హైదరాబాద్‌లో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికినట్లు తెలిపారు. విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఈవీ వాహనాలపై వందశాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మాఫీ చేశామన్న మంత్రి పొన్నం.. దీంతో రాష్ట్ర ప్రజలకు సుమారు రూ.1000 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. వచ్చే ఏడాది కల్లా హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలో భారీగా విద్యుత్‌ బస్సులను ప్రవేశ పెట్టే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ఆటోల విద్యుద్దీకరణకు అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం తెలిపారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ఆ శాఖ కమిషనర్‌ ఇలంబర్తీ, టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తదితరులు ప్రసంగించారు.

Updated Date - Mar 18 , 2026 | 04:46 AM