Share News

హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో సెమీ కండక్టర్‌ కేంద్రం

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:10 AM

హైదరాబాద్‌ను సెమీ కండక్టర్‌ పరిశోధనలో జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. నేషనల్‌ సెమీ కండక్టర్‌ మిషన్‌కు అనుసంధానంగా రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో .....

హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో సెమీ కండక్టర్‌ కేంద్రం

  • ఏడాదికి 5 వేల మంది సాంకేతిక నిపుణులకు శిక్షణ

  • ఏడాదికి బిలియన్లకొద్దీ డాలర్లు సెమీ కండక్టర్ల దిగుమతికే

  • భవిష్యత్తులో మరింత విస్తరణ దిశగా యోచనలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను సెమీ కండక్టర్‌ పరిశోధనలో జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. నేషనల్‌ సెమీ కండక్టర్‌ మిషన్‌కు అనుసంధానంగా రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సెమీ కండక్టర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) ఏర్పాటు చేయాలని కేంద్ర ఐటీ శాఖ సూత్రపాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గతంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్‌ అవసరాలు, సురక్షిత ఈ-గవర్నెన్స్‌ వ్యవస్థల నిర్మాణం, సైబర్‌ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని స్థాపిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఏటా 5వేల మంది సాంకేతిక నిపుణులకు సెమీ కండక్టర్‌ డిజైనింగ్‌లో శిక్షణ, ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి కటింగ్‌ టెక్నాలజీ అంశాలపై శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా విదేశీ సెమీ కండక్టర్‌ కంపెనీలను కూడా ఆకర్షించి అనతి కాలంలోనే తమ లక్ష్యాన్ని చేరుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, ఆటోమొబైల్‌ వాహనాలు, వైద్య పరికరాలు, రక్షణ వ్యవస్థలు.. ఇలా ప్రతి రంగంలోని విద్యుత్తు ఆధారిత సర్క్యూట్‌లో సెమీ కండక్టర్‌ చిప్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌ తన అవసరాల్లో సుమారు 90-95 శాతం వరకు సెమీ కండక్టర్లను తైవాన్‌, చైనా, సౌత్‌ కొరియా, సింగపూర్‌, మలేసియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. గ్లోబల్‌ సరఫరా గొలుసు అంతరాయాల సమయంలో ఈ విధంగా సెమీకండక్టర్ల కోసం విదేశాలపైన ఆధారపడటం దేశానికి భారంగా, సవాలు గానూ మారింది.


ఈ పరిస్థితిని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రానున్న పదేళ్లలో స్వదేశీ సెమీ కండక్టర్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, భవిష్యత్తులో ఎగుమతిదారుగా ఎదగాలని సంకల్పించింది. అదే దిశగా పరిశోధన-అభివృద్థి, చిప్‌ డిజైన్‌, సెక్యూర్‌ చిప్‌ టెక్నాలజీ, గవర్నెన్స్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను రూపకల్పన చేస్తున్నారు. ఐటీ రంగానికి అనువైన వాతావరణం, బలమైన స్టార్ట్‌అప్‌ కల్చర్‌, అంతర్జాతీయ ఐటీ సంస్థల ఉనికి, జీసీసీల సముదాయం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఉన్న హైదరాబాద్‌ వంటి నగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానిలో భాగంగానే తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా తెలుస్తోంది. అత్యాధునిక పరిశోధనా ప్రయోగశాలలు, నైపుణ్యాభివృద్థి శిక్షణా కేంద్రాలు, పరిశ్రమ-అకాడమిక్‌ భాగస్వామ్య వేదికలు ఏర్పాటు చేసి, యువ ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దేశాన్ని కీలక సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్థి దిశగా నడిపించేందుకు, డీప్‌ టెక్‌ పరిశోధనలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా నిలబెట్టేందుకు ఈ సెమీ కండక్టర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కీలక మైలురాయిగా నిలవనుంది. అందుకే దేశవ్యాప్తంగా మరిన్ని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, సెమీ కండక్టర్ల తయారీని గణనీయంగా విస్తరించాలని, దాంతో పాటు దేశంలో నెలకొల్పే పరిశ్రమలకు కూడా తగు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 13 , 2026 | 05:10 AM