Minister Jupally Krishna Rao: ఘనంగా ముగిసిన సంక్రాంతి సంబురాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:50 AM
ఈయేడు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి.
భవిష్యత్‌లో మరిన్ని వినూత్న కార్యక్రమాలు: మంత్రి జూపల్లి
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఈయేడు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ఈ సంబురాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభించింది. ప్రతియేటా నిర్వహించే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు తోడు అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణుల సహకారంతో నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోల్లో ప్రజలు ఉత్సాహంతో పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో కైట్ అండ్ స్వీట్స్ వేడుకలు, గోల్కొండ గోల్ఫ్ కోర్పు మైదానం కేంద్రంగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్స్ విజయవంతంగా జరిగాయి. ప్రజల విస్తృత భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషితో సంక్రాంతి సంబురాలు అత్యంత విజయవంతంగా ముగిశాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.