ఆగస్టులో సైదాబాద్ స్టీల్ వంతెన సిద్ధం
ABN , Publish Date - Jul 09 , 2026 | 05:39 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యంత పొడవైన నల్లగొండఎక్స్ రోడ్డు- సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది.
620 కోట్లతో నిర్మాణం.. తుది దశకు పనులు
గ్రేటర్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద స్టీల్ వంతెన
పనులు పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్ సిటీ/సైదాబాద్, జూలై 8(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యంత పొడవైన నల్లగొండఎక్స్ రోడ్డు- సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ బుధవారం నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెన ప్రజలకు అందుబాటులోకి రావాలని, తదనుగుణంగా పనులు జరగాలని స్పష్టంచేశారు. నగరంలో ప్రస్తుతం అతి పొడవైన స్టీల్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతోఇందిరా పార్కు నుంచి వీఎస్‌టీ వరకు ఉంది. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని 3.32 కి.మీల పొడవుతో రూ.620 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ వంతెన చంచల్‌గూడ జైలు నుంచి సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ వరకు ఉంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నాలుగు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి 2020లో శంకుస్థాపన చేశారు. దీనికి అక్బర్‌బాగ్ వద్ద ఒక అప్ ర్యాంప్, మరో మూడు డౌన్ ర్యాంపులు ఉన్నాయి. వంతెన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా.. బారియర్ల ఏర్పాటు, ర్యాంపుల వద్ద పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన అందుబాటులోకి వస్తే నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ వరకు 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది.