ఆ ఖాతాలో ఒకేసారి రూ.296 కోట్లు!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:17 AM
సైబర్ నేరాల్లో కీలకమైన మ్యూల్ ఖాతాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి డబ్బు ఎక్కడికి వెళుతోందో శోధిస్తున్నారు.
సైబర్ నేరాల సొమ్మంతా అందులోకే...
కొండాపూర్ కేంద్రంగా మొదలైన ఈ ఫ్రాడ్‌కు వివిధ రాష్ట్రాల్లో కేసులకు లింకు
సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల్లో కీలకమైన మ్యూల్ ఖాతాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి డబ్బు ఎక్కడికి వెళుతోందో శోధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఖాతాలోకి ఒకేసారి రూ.296.96 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ సొమ్ము తిరిగి ఎక్కడెక్కడి బదిలీ అయిందో తెలుసుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఖాతా 2022 అక్టోబరు 13న ప్రారంభం కాగా.. 2025 ఆగస్టు 5వరకు భారీ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సరైన ఆదాయ వనరులు లేకపోయినా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా అనుమానాస్పద ఖాతాలను పోలీసులు గుర్తించారు. అందులో ఏవీ.ఇన్వె్‌స్టమెంట్ సొల్యూషన్ పేరిట కొండాపూర్‌లో నివసించే వేణుగోపాల్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఖాతాను పలు సైబర్ మోసాలకు ఉపయోగించినట్లు తేలింది. ఈ ఖాతా ద్వారా మొత్తం రూ.296.96 కోట్ల లావాదేవీలు జరిగాయి. కొండాపూర్ కేంద్రంగా సాగిన భారీ సైబర్ మోసం కేసుకు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కనీసం 21 సైబర్ మోసాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో నమోదైన ఫిర్యాదుల్లో ఈ ఖాతాను తరచుగా ఉపయోగించినట్లు తేలింది. నిందితుడు వేణుగోపాల్ తన ఖాతాను అక్రమంగా ఉపయోగించేందుకు అనుమతిస్తూ, ఇతర సహచరులతో కలిసి మోసపూరితంగా డబ్బును మార్గం మళ్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు.