‘పాదముద్ర’లతోనే పట్టేయొచ్చు!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:47 AM
నేరస్థుల పాద ముద్రల (ఫుట్‌ప్రింట్) ఆధారంగా ఆ వ్యక్తి ఎత్తు ఎంత? మహిళా? పురుషుడా? విషయాలను అత్యంత కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు....
ఫుట్‌ప్రింట్లతో ఎత్తు, లింగ నిర్ధారణ చేయొచ్చు
హైదరాబాద్ మల్లారెడ్డి మెడికల్ కాలేజీ పరిశోధనలో వెల్లడి
తెలంగాణ ప్రజలపై ఫోరెన్సిక్ నిపుణుల కీలక పరిశోధన
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): నేరస్థుల పాద ముద్రల (ఫుట్‌ప్రింట్) ఆధారంగా ఆ వ్యక్తి ఎత్తు ఎంత? మహిళా? పురుషుడా? విషయాలను అత్యంత కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు! హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రముఖ పరిశోధకుడు కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ నివేదిక, ఫోరెన్సిక్ దర్యాప్తు రంగంలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది డిసెంబరు 2022 నుంచి అక్టోబరు 2024 వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన 16-25 ఏళ్ల వయసు గల 150 మంది యువతీయువకుల (75మంది పురుషులు, 75మంది మహిళలు)పై ఈ పరిశోధన నిర్వహించారు. భౌగోళిక, జాతిపరమైన తేడాల వల్ల ఆయా ప్రాంతాల ప్రజల శారీరక కొలతలు మారుతుంటాయి కాబట్టి, ప్రత్యేకంగా తెలంగాణ జనాభాను ప్రామాణికంగా తీసుకుని ఈ నివేదిక రూపొందించారు.
పరిశోధనలోని ముఖ్యాంశాలు
చేతులే కాదు పాదముద్రలు కూడా ఏ ఇద్దరు వ్యక్తులవీ ఒకేలా ఉండవు. పాదముద్రల ప్రత్యేకత కారణంగా వ్యక్తిగత గుర్తింపులో ఒక కీలక సాధనంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు వ్యక్తులను గుర్తించడానికి ఆధునిక బయోమెట్రిక్ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు.
పరిశోధనలో పాల్గొన్నవారి పాద ముద్ర పొడవుకు, వారి మొత్తం శరీర ఎత్తుకు అత్యంత బలమైన సానుకూల సంబంధం ఉన్నట్లు తే లింది. ముఖ్యంగా ఎడమ అరికాలి పొడవు ఆధారంగా వ్యక్తి ఎత్తును మరింత కచ్చితంగా అంచ నా వేయవచ్చని అధ్యయనంలో వెల్లడైంది.
అరికాలి ముందరి భాగం వెడల్పు ఆధారంగా స్ర్తీ, పురుష భేదాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం పురుషుల సగటు అరికాలి వెడల్పు 9.056 సెంటీమీటర్లుగా ఉండగా, మహిళల్లో ఇది 8.243 సెంటీమీటర్లుగా నమోదైంది. బైౖనరీ లాజిస్టిక్స్ రిగ్రెషన్, కర్వ్ విశ్లేషణల ద్వారా కేవలం ఎడమ అరికాలి వెడల్పు, కుడి అరికాలి పొడవుల ఆధారంగా సదరు వ్యక్తి ఆడా? మగా? అనే విషయాన్ని 72-79 శాతం కచ్చితత్వంతో నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సాధారణంగా దొంగతనాలు, హత్యలు జరిగిన ప్రాంతాల్లో నిందితులు తమ అడుగుజాడలను వదిలివెళ్తుంటారు. ఘటనా స్థలంలో దొరికిన పాద ముద్రలతోనే అనుమానితుల జాబితాను రూపొందించి, అసలైన నేరస్థులను త్వరగా పట్టుకునేందుకు ఈ నివేదిక వీలు కల్పిస్తుంది. తెలంగాణ జనాభాపై చేసిన ఈ పరిశోధన అంతర్జాతీయ స్థాయిలోనూ శాస్త్రీయ ఆధారాలతో నేరాలను నిరూపించడంలో ఫోరెన్సిక్ రంగానికి కీలకంగా మారనుంది.